స్టాలిన్‌ చర్యలపై ఆగ్రహం

25 Jun, 2018 11:16 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై గవర్నర్‌ భన‍్వరిలాల్‌ పురోహిత్‌ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జిల్లాల్లో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పర్యటనను అడ్డుకోవాలని యత్నిస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ప్రతిపక్షానికి గవర్నర్‌ హెచ్చరికలు జారీచేశారు. ‘గవర్నర్‌కు కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయి. వాటిననుసరించి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. కాదని ఎవరైనా విఘాతం కలిగించాలని యత్నిస్తే వాళ్లు జైలుకు వెళ్లాల్సిందే. ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం గవర్నర్ కార్యకలాపాలను అడ్డుకునేవారిపై కేసు నమోదుచేసి, ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంది’ అంటూ రాజ్‌భవన్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉంటే బాధ్యతలు స్వీకరించిన వెంటనే జిల్లాలు పర్యటిస్తున్న గవర్నర్‌ భన్వరిలాల్‌.. ప్రభుత్వ కార్యాలయాల సందర్శించి అక్కడి కార్యాకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర ఆగ్రహం వెల్లగక్కుతోంది.  ‘రాజ్‌భవన్‌ మరో సచివాలయంగా మారిందని, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ ఓ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారంటూ’ అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ విమర్శించారు. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, రాష్ట్ర ప్రయోజనాల్ని తుంగలో తొక్కే రీతిలో వ్యవహరిస్తున్న ఆయన్ను తప్పించాల్సిందేనని డిమాండ్‌ వినిపిస్తున్నారు.

అయితే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా గవర్నర్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. విమర్శలు, ఆరోపణలు, ఆందోళనల్ని ఖాతరు చేయకుండా తన దారిలో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం గవర్నర్‌ నామక్కల్‌ పర్యటన సందర్భంగా డీఎంకే నల్ల జెండాల ప్రదర్శన వివాదానికి దారితీయగా, పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. తాజాగా రాజ్‌భవన్‌ హెచ్చరికలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు