మళ్లీ ఆ రోజులు రావు

7 Aug, 2018 19:13 IST|Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94)మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు మంగళవారం ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనను కడసారి చూడాలని కోరికతో అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలి వస్తున్నారు. 

తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతిపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర పలువురు రాజకీయ ప్రముఖులు,  ఇతర రంగాల ప్రముఖులు సోషల్‌ మీడియాలో సంతాప సందేశాలను పోస్ట్‌  చేశారు. అటు  కళైంగర్‌ మరణంపై తమిళ నటి  రాధికా శరత్‌ కుమార్‌ స్పందించారు. తనకు సంబంధించినంతవరకు,  తమిళనాట మళ్లీ అలనాటి రాజకీయాలను, ఆ రోజులను మళ్లీ చూడలేమని ట్వీట్‌ చేశారు. మనకిది చీకటి రోజు, నా మనస్సు, హృదయం ఆ అధినాయకుడి జ్ఞాపకాలతో నిండిపోయింది. తమిళుల ఆత్మగౌరవం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడాయన. ఆయన ఆత్మ శాశ్వతమంటూ రాధిక కన్నీటి సంతాపం తెలిపారు. ఈ సందర‍్భంగా కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఫోటోను షేర్‌ చేశారు.

తమిళ హీరో, రాజకీయ నాయకుడు రజనీకాంత్‌ కూడా కరుణానిధి మరణంపై ట్విటర్‌లో సంతాప సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ఇది చీకటిరోజు. ఆ కళాకారుడి జీవితంలోని ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను.  ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ట్వీట్‌ చేశారు.  హీరో సిద్ధార్ద్‌ స్పందిస్తూ..తమిళ దిగ్గజం నేలకొరిగింది. తమిళనాట ఆయనకు ఆయనే సాటి.  ఒక గొప్ప సమకాలీన రాజకీయనాయకుడిని, ఇటు సృజనాత్మక దురంధరుడిని కోల్పోయింది. ఆయన  లేని లోటు పూడ్చలేదని ట్విట్‌ చేశారు.

అటు కరుణానిధి ఆరోగ్యం ఈ రోజు మధ్యాహ్నం నుంచి  బాగా విషమించడంతో రాష్టంలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.  ఆయన ఇక మనకు లేరని చివరికి వైద్యులు ధృవీకరించడంతో  అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు