ప్యాకేజీతో చంద్రబాబు మోసగించారు

26 Mar, 2019 08:21 IST|Sakshi

ఎన్నికల వేళ పసుపు–కుంకుమ తాయిలంతో మభ్యపెడుతున్నారు 

అమరావతి ఎక్కడ? పోలవరం పూర్తైందా?..  

జగన్‌ పథకాల్ని, పోరాటాల్ని కాపీ కొట్టడం భావ్యమేనా? 

జగన్‌ వస్తే తండ్రిలా పాలిస్తాడని జనం నమ్ముతున్నారు 

నవరత్నాలు, బీసీ డిక్లరేషన్‌ మంచి పథకాలు 

ఈ రోజుల్లో హీరోలు సీఎం కావడం అసాధ్యం  

‘సాక్షి’తో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ 

టీడీపీ పాలనలో ఎవరికీ మేలు జరగలేదు. గతంలో ఇచ్చిన హామీల్ని మరిచి ఎన్నికలు రాగానే కొత్తవి ఎత్తుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయింది. ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పేరిట తాయిలాలిచ్చి మోసగిస్తున్నారు. అమరావతి అద్భుతం అన్నారు.. పోలవరం పూర్తయిందన్నారు.. జనాలకు ఏం చెప్పినా నడుస్తుందనుకున్నారు. తాత్కాలిక నిర్మాణాలకు, పర్యటనల పేరిట వందల కోట్ల  ప్రజాధనం వృథా చేశారు. ఇదేనా ఆయన పరిపాలనా దక్షత.  జగన్‌ సీఎం అయితే ఆయన తండ్రిలా పాలిస్తాడనే ఆశ ప్రజల్లో ఉంది. ప్రజలకు ఏం చేయాలో పాదయాత్ర ద్వారా జగన్‌ తెలుసుకున్నారు’ అని ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఎన్నికల వేళ తన మనసులో మాటను సాక్షితో పంచుకున్నారు. తమ్మారెడ్డి అంతరంగం ఆయన మాటల్లోనే చదువుదాం. 

ప్రజల్ని మభ్యపెట్టిన వారికే  అధికారం దక్కింది  
గత ఎన్నికల్లో కేవలం ప్రజలను మభ్యపెట్టే పథకాలు ప్రకటించిన వారికే అధికారం దక్కింది. తాత్కాలికంగా పనులు చేస్తూ.. భవిష్యత్‌కు ఉపయోగపడే పథకాలు చేపట్టడంలేదు. హామీ సాధ్యమా? కాదా? అనేది ఆలోచించకుండా వాగ్దానాలు చేయడం అలవాటైంది. చంద్రబాబు పాలనా విధానాల్లో చాలా లోపాలున్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కోవడం, కేంద్రంలో మోదీతో కలవడంతో ఆయనలో ధీమా ఎక్కువైంది. జనాలకు మనం ఏం చెప్పినా నడుస్తుందనుకున్నారు. అమరావతి అన్నారు. పోలవరం అని చెప్పారు. ఆచరణలో మాత్రం పురోగతి లేదు. 

తాత్కాలిక నిర్మాణాల కోసం అంత ఖర్చా! 
కొత్త రాజధానిలో తాత్కాలిక నిర్మాణాల పేరిట డబ్బును వృథా చేస్తున్నారు. వాటితో కొన్ని చిన్న ప్రాజెక్టులు పూర్తయ్యేవి. రాష్ట్రం విడిపోగానే శాశ్వత భవనాలు కట్టుకుని ఉంటే ఈ పాటికి పూర్తయ్యేవి. ఏదో గొడవ పడి.. చివరకు అప్పటికప్పుడు అమరావతికి మారారు. మూడేళ్లు ఆలస్యంగా నిర్మాణాలు మొదలు పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. భూసేకరణ విషయంలో రైతులకు సినిమా చూపించారు. మూడు పంటలు పండే పంటపొలాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం.?

హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు చేతకానితనమే కారణం. ప్యాకేజీకి ఒప్పుకోవడం చంద్రబాబు తప్పు. కేంద్రంలోని పెద్దలకు సన్మానాలూ చేశారు. ప్యాకేజీ గొప్పదని చెప్పి ప్రజలను మోసగించారు. బీజేపీ, మోదీ బంగారం అంటూ పొగిడారు. అది తప్పని ఆరోజు తెలియదా? ఇప్పుడు అన్యాయమని బాబు గగ్గోలు పెడుతున్నారు. సీనియర్‌ నాయకుడు ఇలా చేయడం ఆశ్చర్యం.  
 
టీడీపీ హయాంలో పేదలకు మేలు జరగలేదు 
ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏ మేలూ జరగలేదు. వైఎస్సార్, ఎన్టీయార్‌ పాలనలో మాత్రమే పేదలకు పట్టం కట్టారు. పేదలకు విద్య, వైద్యం, గూడు, తాగునీరు, ఉపాధి ఇలా వేటినీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికలొచ్చాయని ‘పసుపు–కుంకుమ’ పేరిట మహిళలకు పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇస్తున్నారు. వీటిని ఎవరు చెల్లిస్తారు. ఎన్నికల ముందు తాయిలాలిచ్చి ఎన్నాళ్లు మభ్యపెడతారు. 

ప్రతిపక్షం పథకాల్ని కాపీ కొడితే ఎలా?.. 
ప్రజాసమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ కొత్త పథకాలు ప్రకటించింది. ప్రతిపక్షం ముందుగా మొదలుపెడితే చంద్రబాబు వాటిని పట్టుకుని పరుగెడుతున్నారు. ఆంధ్రాకు అన్యాయం జరుగుతోందని జగన్‌ అన్ని రాష్ట్రాలు తిరిగితే చంద్రబాబు అదే బాటపట్టారు. స్పెషల్‌ స్టేటస్‌ కోసం మొదటినుంచి జగన్‌ పోరాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు అదే అజెండా పట్టుకున్నారు.  

సంక్షేమ పథకాల్ని నిర్వీర్యం చేశారు
ఆరోగ్యశ్రీ,  ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104.. ఇవన్నీ వైఎస్‌ ప్రవేశపెట్టిన గొప్ప పథకాలు. తర్వాత వచ్చి న ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేశాయి. చాలా 108 వాహనాలు మూలనపడ్డాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల ఎంతోమంది విద్యావంతులయ్యారు. మంచి ఉద్యోగాలొచ్చాయి. ఆ పథకంలోని ఇబ్బందుల్ని సరిదిద్దుకుని అమలు చేయాలి. అంతేకాని... మొత్తానికే ఎత్తేస్తే ఎలా.

  

జగన్‌.. తండ్రిలా పాలిస్తాడని  ప్రజలు భావిస్తున్నారు 
ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమవడం చాలా అవసరం. ఒక మనిషి ఏడాదికి పైగా ప్రజల్లో కలిసి ఉండటం, 3,648 కి.మీ.ల దూరం నడవడమంటే.. ఎంతో స్థిరనిశ్చయం ఉంటేనే సాధ్యం. పాదయాత్ర వల్ల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి బాటలు వేయొచ్చు. వైఎస్సార్‌ పాదయాత్రతో సమస్యలు తెలుసుకుని పరిష్కరించారు. జగన్‌ సీఎం అయితే ఆయన తండ్రిలా పరిపాలన చేస్తాడని ప్రజల్లో ఆశ ఉంది. అందుకే వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, గౌరవం జగన్‌పై చూపుతున్నారు. ప్రస్తుత  పాదయాత్రవల్ల ఆయనపై ప్రజల ఆశ మరింత పెరిగింది. నవరత్నాలు, బీసీ డిక్లరేషన్‌ మంచి పథకాలు.
 

పోలవరంపై అంతా ప్రచార అర్భాటమే 
వైఎస్‌ దూరదృష్టికి పోలవరం ప్రాజెక్టు ఉదాహరణ. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది ఆయనే. ఆయన హయాంలోనే ప్రధాన పనులు జరిగాయి. ప్రస్తుతం నిర్మాణం సరిగా సాగడంలేదు. ప్రభుత్వ ప్రచారమే తప్ప పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. ముంపు గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ముంపు బాధితుల సమస్యను పరిష్కరించి ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలి.  

ప్రపంచ పర్యటనల పేరిట వృథా ఖర్చులు 
కొత్త కంపెనీలొస్తాయని చెప్పి విమానాల్లో ప్రపంచమంతా తిరిగారు. ఆ ఖర్చంతా వృథానే కదా.. వాళ్లు చెప్పిన పరిశ్రమలు రాలేదు. పెట్టుబడులు లేవు. వీళ్లు పెట్టుబడుల రాక కోసం ఎంత ఖర్చుపెట్టారో అంత మొత్తం పెట్టుబడులు కూడా రాలేదు. వచ్చిన కొద్ది పెట్టుబడులు కూడా తమ వల్లే వచ్చాయని కేంద్రం చెబుతోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సాధించిందేంటి.? హైదరాబాద్‌ను చంద్రబాబే అభివృద్ధి చేశారంటే ఎవరూ నమ్మరు. సాంకేతిక విప్లవం ప్రపంచమంతా విస్తరించింది. ఆ పరిణామ క్రమంలోనే ఇక్కడా అభివృద్ధి జరిగింది. ఆ సమయంలో ఎవరు సీఎంగా ఉన్నా అలాగే జరిగేది. బెంగళూరు, చెన్నైతో పోలిస్తే మనం వెనుకబడే ఉన్నాం.  

మాతృభాషపై చిన్నచూపు తగదు 
తెలుగుకు ప్రాచీన హోదా సాధించినా ఆంధ్రలో తెలుగు అభివృద్ధికి కృషి జరగడంలేదు. ఈ ప్రభుత్వం స్కూళ్లలో తెలుగు అవసరం లేదని చెబుతోంది. ప్రభుత్వం మన మాతృభాషను, సంస్కృతిని, గౌరవాన్ని కాపాడాలి. అది చేయనపుడు ప్రభుత్వం దేనికి.  

ఇవ్వని హామీలు కూడా వైఎస్‌ అమలుచేశారు 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి విద్య, వైద్యం, గృహ నిర్మాణం, నీటిపారుదల పథకాల్ని ఒక యజ్ఞంలా చేపట్టారు. రాజకీయాలకన్నా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవారు. హామీలన్నీ అమలు చేశారు. చెప్పని హామీలూ పూర్తిచేశారు. వైఎస్‌ అనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ అమలుకాని హామీలిచ్చి, తూతూమంత్రంగా చేసి వదిలేయడం, మళ్లీ కొత్త హామీలివ్వడం సర్వసాధారణంగా మారింది.   చంద్రబాబు చెప్పింది చేయరు.. పైగా అన్నీ నాన్చుతారు. ఏది చేయాలన్నా డబ్బుల్లేవంటారు. ఆయన అనుకున్నవాటికి మాత్రం డబ్బులు ఉంటాయి.  

హీరోలు సీఎంలు కావడం ఇప్పడు సాధ్యంకాదు 
సినీ హీరోలు రాజకీయ పార్టీలు పెట్టి సీఎంలు కావడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. స్వతంత్రంగా గద్దెనెక్కడం అన్నది జరిగేపనికాదు. సాధారణంగా ఎవరు గెలిస్తే వారికే సినీ రంగం అనుకూలం. కొత్త రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఎన్నికల ముందు అది చేస్తాం, ఇది చేస్తాం అని ఏవేవో ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సహించి ఉంటే ఈ పాటికి విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేది. 

ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి 
డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగొద్దు. మంచివాళ్లకు ఓటేస్తే సమాజం బాగుపడుతుంది. రాజ్యాంగం కల్పించిన ఉన్నతమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి.

– యర్రా యోగేశ్వరరావు, సాక్షి ప్రతినిధి

మరిన్ని వార్తలు