గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం: తమ్మినేని

6 Aug, 2018 01:23 IST|Sakshi

మహేశ్వరం: రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్‌ (బహుజన లెఫ్ట్‌ ప్రంట్‌) అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అగ్రకులాల్లోని ధనవంతులే దేశాన్ని పాలించారని, 93 శాతం ఉన్న బహుజన వర్గం నుంచి ముఖ్యమంత్రిని చేసి చూపుతామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలో బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో బహుజన ప్రభుత్వం వివిధ పార్టీల వైఖరి పాత్ర అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగిం ది.

సదస్సులో తమ్మినేని మాట్లాడుతూ.. బీఎల్‌ఎఫ్‌ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో బహుజన భోజనశాల పెట్టి రూ.5కే పేదలకు భోజనం పెడుతుందని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కులా లు, మతాల పేరుతో విభజించి నియంత పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో టీమాస్‌ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు జేబి రాజు, రాష్ట్ర నాయకుడు భూపాల్, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీ సభ్యుడు అలువాల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు