టీఆర్‌ఎస్‌ను గద్దెదింపుతాం

26 Feb, 2018 02:34 IST|Sakshi

కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వం

బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్న టీఆర్‌ఎస్‌ను అధికారం నుంచి గద్దెదింపుతామని, అలాగే 60 ఏళ్లపాటు అధికారంలో ఉండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌ పార్టీని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను అధికారంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జిల్లా జెడ్పీ మైదానంలో జరిగిన బీఎల్‌ఎఫ్‌ భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ హామీని తుంగలో తొక్కి తమ కుటుంబంలోని నలుగురికి మాత్రం ఉద్యోగ సదుపాయాలు కల్పించుకున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్‌ అమలు చేయలేదని, అందువల్లే ఆ పార్టీని గద్దె దింపుతామని అన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న రాష్ట్ర ప్రజలు తమకే అధికారం కట్టబెడతారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారని, వారు అధికారంలో ఉన్నంతకాలం చేసిన మోసాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి రానివ్వబోమని స్పష్టంచేశారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఎల్‌ఎఫ్‌ను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి అందరికి అందుబాటులో ఉండే విధంగా చూస్తామని అన్నారు. సభలో బీఎల్‌ఎఫ్‌ వైస్‌ చైర్మన్‌ జలజం సత్యనారాయణ, నాయకులు మజిదుల్లాఖాన్, పటేల్‌ వనజ, జి.రమేశ్, శ్రీనివాస్‌ బహదూర్, జానకిరాములు, చంద్రన్న, జాన్‌వెస్లీ, కిల్లె గోపాల్, సాగర్, వెంకట్రాములు ప్రసంగించారు.

మరిన్ని వార్తలు