నేరాలకు, బీసీలకు ఏం సంబంధం?

14 Jun, 2020 04:47 IST|Sakshi

అచ్చెన్నాయుడు బీసీ కాబట్టి వదిలేద్దామా?

అచ్చెన్న అరెస్టు విషయం నాకు తెలియ జేశారు

అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, అమరావతి: ‘అసలు నేరాలకు, బీసీలకు సంబంధం ఏమిటి? అచ్చెన్నాయుడు బీసీ అయినంత మాత్రాన ఆయన చేసిన నేరానికి వదిలేద్దామా? అని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సూటిగా ప్రశ్నించారు. టెక్కలి శాసనసభ్యుడు కె.అచ్చెన్నాయుడు అరెస్టుకు సంబంధించి తనకు ముందుగానే సమాచారం ఉందన్నారు. అరెస్టు విషయంలో విధి విధానాలు పాటించ లేదని, స్పీకర్‌కు సమాచారం ఇవ్వలేదని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అచ్చెన్న అరెస్టు సమాచారాన్ని ఏసీబీ డీడీ, జైళ్ల శాఖ, న్యాయశాఖ మూడింటి నుంచీ తనకు సమాచారం వచ్చిందని, ఏఏ సెక్షన్ల కింద అరెస్టు చేశారో తెలియ జేశారని చెప్పారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12వ తేదీ ఉదయం 7.20 గంటలకు అచ్చెన్నను అరెస్టు చేసినట్లు, న్యాయమూర్తి ముందు హాజరు పరిచి, రిమాండుకు పంపినట్లు తనకు ఆయా శాఖల నుంచి వచ్చిన సమాచార ప్రతులను పత్రికలకు విడుదల చేశారు. 

సీతారామ్‌ ఇంకా ఏమన్నారంటే... 
► అచ్చెన్నాయుడు విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు సరైనవి కావు. 
► నేరస్థులకు కులాన్ని ఆపాదించి ఆయా వర్గాలను అవమానిస్తున్నారు. 
► అచ్చెన్నాయుడు నేరం చేయకపోతే ఎవరు చేశారో చంద్రబాబు చెప్పాలి. 
► బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈఎస్‌ఐ కుంభకోణం జరిగింది. 
► ఏసీబీ అధికారుల ఫండమెంటల్‌ డ్యూటీని రాజకీయాల కోసం తప్పుదారి పట్టిస్తున్నారు. 
► ఎమ్మెల్యేగా ఉన్న నేరస్థుడిని పట్టుకుని స్వాతంత్య్ర సమరయోధునిగా చిత్రీకరిస్తున్నారు. 
► గాంధీ, పూలే, అంబేడ్కర్‌ విగ్రహాల దగ్గర నిరసనలు చేసి ప్రజలకు ఏమి సంకేతం ఇస్తున్నారు? 
► టీడీపీ చేస్తున్న ఆందోళనలు ఎస్సీ, ఎస్టీ, బీసీలను అవమానించేలా ఉన్నాయి. 
► ఈ కేసును లోతుగా విచారిస్తే మనీ ల్యాండరింగ్, మనీ లేయరింగ్‌ నేరాలు వెలుగు చూస్తాయి. ఆ వ్యవహారం దర్యాప్తులో తేలుతుంది. 
► ప్రభుత్వం నుంచి కొల్లగొట్టిన ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవడానికి టెక్కలికి చెందిన గ్రానైట్‌ వ్యాపారుల పాత్ర ఉందని సమాచారం. 
► బీసీలు అనే ముందు ఈ కుంభకోణంలో బాధితులెవరో టీడీపీ నేతలు చెప్పాలి. 
► ఈఎస్‌ఐ సొమ్ము కార్మికులకు చెందాల్సింది. కార్మికుల్లో ఎక్కువగా ఉండేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కాదా? వారికి చేరాల్సినవి బీసీ పేరు చెప్పి దోచేస్తారా?

ఆన్‌లైన్‌లో గవర్నర్‌ ప్రసంగం
శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆన్‌లైన్‌లో లైవ్‌లో ప్రసంగిస్తారని స్పీకర్‌ సీతారామ్‌ తెలిపారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రావద్దని ఎవరిపైనా ఆంక్షలు పెట్టడం లేదని చెప్పారు. శాసనసభ లోపల భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు