‘అధిపతులు’ వ్యవహరించాల్సింది ఇలాగేనా!

27 Aug, 2019 05:17 IST|Sakshi
తాడేపల్లిలో జరిగిన వాసిరెడ్డి పద్మ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడుతున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం. చిత్రంలో పుష్పశ్రీవాణి, కృష్ణదాస్, నారాయణస్వామి, తానేటి వనిత, రోజా తదితరులు

అప్పట్లో రోజాను ఎలా వేధించారో చూశాం

వాసిరెడ్డి పద్మ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పీకర్‌ తమ్మినేని

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మీడియాలో వారం రోజులుగా పుంఖానుపుంఖాలుగా వస్తున్న వార్తలు చూస్తుంటే విస్మయం కలుగుతోందని, రాజ్యాంగ వ్యవస్థల అధిపతులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. పరోక్షంగా మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుపై వస్తున్న వరుస ఆరోపణలను ఆయన గుర్తు చేశారు. సోమవారం తాడేపల్లిలో జరిగిన రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజాను ఎంతగా వేధించారో చూశామన్నారు. ఆమె హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి వచ్చి శాసనసభలోకి అడుగు పెట్టబోతే అనుమతించకుండా దారుణంగా అవమానించారని స్పీకర్‌ తెలిపారు. అంతకు ముందు వాసిరెడ్డి పద్మ చేత రాష్ట్ర మహిళా, శిశు, సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గా ప్రమాణ స్వీకారం చేయించారు. అర్హత కలిగిన మహిళానేతని చైర్‌ పర్సన్‌గా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారన్నారు.

వాసిరెడ్డి పద్మను ఉక్కుమహిళ అని పిలిచేవారు
ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాసిరెడ్డి పద్మను ఉక్కు మహిళ అని పిలిచేవారన్నారు. వైఎస్‌ జగన్‌ ఆలోచనకు అనుగుణంగా ఆమె పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు. ఏపీఐఐసీ చైర్‌ పర్సన్‌ ఆర్‌ కే రోజా మాట్లాడుతూ... మాజీ సీఎం చంద్రబాబు, మాజీ స్పీకర్‌ కోడెల మహిళల పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా సంరక్షణ కోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ సలహాదారులు జీవిడి కృష్ణ మోహన్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి గొంతుకుగా వాసిరెడ్డి పద్మ వ్యవహరించారన్నారు.
 
ఆ ముగ్గురే ఆదర్శం: వాసిరెడ్డి పద్మ

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, షర్మిల నేటి మహిళలకు ఆదర్శమని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న వారు మహిళలందరికీ ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ట దాస్, గుమ్మనూరు జయరామ్, అవంతి శ్రీనివాస్, చెరుకువాడ రంగనాథ్‌ రాజు, శంకర నారాయణ, ఎంపీలు వంగ గీత, చింత అనురాధ, ఎమ్మెల్యేలు విడదల రజని, శ్రీదేవి, రెడ్డి శాంతి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీ చల్లా మధు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు