స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని 

13 Jun, 2019 11:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.  ప్రొటెం స్పీకర్‌ శంబంగి చిన్న వెంకటఅప్పలనాయుడు గురువారం ఉదయం సభాపతి తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, మంత్రులు, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు తదితరులు తమ్మినేనిని అధ్యక్ష స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మూడుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేని సీతారాంకు ఉంది.


ఒకే నామినేషన్‌..
స్పీకర్‌ పదవికి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయిన సంగతి తెలిసిందే. బుధవారం స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. సాయంత్రం ఐదు గంటలలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా తమ్మినేని నామినేషన్‌ ఒక్కటే దాఖలైంది. తమ్మినేని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో సహా 30 మంది ఎమ్మెల్యేలు నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, తానేటి వనిత, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వెంట రాగా తమ్మినేని సీతారాం.. శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులుకి నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

తమ్మినేనికి మద్దతుగా సంతకాలు..
తమ్మినేనికి మద్దతుగా సంతకాలు చేసిన వారిలో డిప్యూటీ సీఎంలు కె.నారాయణస్వామి, షేక్‌ బేపారి అంజాద్‌ బాష, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, అనిల్‌కుమార్‌ యాదవ్, ఎం.శంకర్‌ నారాయణ, ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పీడిక రాజన్నదొర, రఘురామిరెడ్డి, అంబటి రాంబాబు, మేడా మల్లికార్జునరెడ్డి, కె.శ్రీనివాసులు, జోగి రమేష్, కోలగట్ల వీరభద్రస్వామి, గొల్ల బాబూరావు, మద్దిశెట్టి వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ, ఎం.నవాజ్‌ బాష, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, విడదల రజని, ఫాల్గుణ, అర్థర్, వసంత వెంకట కృష్ణప్రసాద్, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు