మీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయరు?

30 Mar, 2018 01:43 IST|Sakshi

పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం డిమాండ్‌

విజయవాడ సిటీ:  ‘‘ఎందుకు భయపడుతున్నావు బాబూ.. మీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయరు?’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర  అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్ర  స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా? అని ఆయన ప్రశ్నించారు. విజయవాడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం తమ్మినేని సీతారాం విలేకరులతో మాట్లాడారు. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా పోరాటానికి ఇప్పటికైనా కలసిరావా చంద్రబాబూ అని ఆయన నిలదీశారు. మీకు స్వార్థప్రయోజనాలే తప్ప రాష్ట్రప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు వల్ల భయపడుతున్నావా లేక పోలవరంలో మీ అవినీతి బయటపడుతుందన్న భయమా అని ఎద్దేవా చేశారు.

మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదని సీతారాం వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలనూ అవినీతిమయం చేసిన చంద్రబాబు ఆ అవినీతిపై ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తుందోనని భయపడుతున్నారని అన్నారు.  నాలుగేళ్లుగా చంద్రబాబు చేసిన అవినీతి, నేరాలు, ఘోరాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.  ఇందుకు చంద్రబాబు సిద్ధం కావాలని తమ్మినేని సూచించారు. ప్రత్యేకహోదాపై నీతిఆయోగ్‌ అభ్యంతరం చెప్పిందని కేంద్రం చెబితే ఎలా అంగీకరించారని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను  కేంద్రం వద్ద ఫణంగా పెట్టే అధికారాన్ని చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దేశంలోనే ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. కళంకిత ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.  అందర్నీ ఆర్ధిక నేరస్తులు అంటున్న చంద్రబాబు, తనపై వున్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకుంటారా అని నిలదీశారు.

మరిన్ని వార్తలు