ఏపీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం?

7 Jun, 2019 13:09 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ఐదుగురు డిప్యూటీ సీఎంలతో సహా మొత‍్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మొత‍్తం 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఇక మంత్రివర్గ ఏర్పాటు పూర్తవ్వడంతో స్పీకర్‌ ఎవరా? అనే చర్చమొదలైంది. అయితే స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి గెలిచిన మాజీ మంత్రి తమ్మినేని సీతారాంను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ఎల్పీ సమావేశం అనంతరం తమ్మినేని సీతారాం వైఎస్‌ జగన్‌తో భేటీకావడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. బీసీ (కళింగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు స్పీకర్‌ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన కేబినేట్‌లో బడుగు, బలహీన వర్గాలకు వైఎస్‌ జగన్‌ పెద్దపీట వేయడంతో.. స్పీకర్‌ పదవి కూడా ఆ వర్గాలకే కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఆముదాలవలస నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతారాం.. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో ప్రభుత్వ విప్‌గా, 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా సీతారాం సేవలందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై తమ్మినేని సీతారాం 13,856 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

చదవండి: రవిపై.. సీతారామ బాణం

మరిన్ని వార్తలు