లీకుల్లో యుద్ధం... మైకుల్లో స్నేహం

5 Feb, 2018 01:55 IST|Sakshi

బీజేపీతో పొత్తుపై తీవ్ర నిర్ణయం తప్పదంటూ అనుకూల మీడియాలో టీడీపీ లీకులు 

టీడీపీ లొంగుబాటుపై ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు నాటకం

నిరసనలు, విమర్శలు వద్దని టీడీపీపీలో నిర్ణయం

సాక్షి, అమరావతి:  కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఇక తీవ్రమైన నిర్ణయాలు తప్పవంటూ నాలుగు రోజులుగా హంగామా చేసి, ఏదో జరిగిపోతోందంటూ భారీగా బిల్డప్‌ ఇచ్చిన అధికార తెలుగుదేశం పార్టీ చివరకు అలాంటిది ఏమీ లేదని తేల్చేసింది. అసంతృప్తిని తొలుత కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, మరీ అవసరమైతే పార్లమెంట్‌లో ప్రస్తావించాలని నిర్ణయించింది. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ నాయకులు బడ్జెట్‌ అంశంపై నాలుగు రోజులుగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.

బడ్జెట్‌లో రాష్ట్రానికి అరకొర కేటాయింపులపై ప్రజలు అసంతృప్తి చెందుతుండటంతో టీడీపీలో కలవరం మొదలైంది. బీజేపీతో పొత్తుపై తీవ్ర నిర్ణయం తీసుకుంటామని అనుకూల మీడియా ద్వారా లీకులు ఇప్పించింది. ఆదివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ(టీడీపీపీ) సమావేశం సందర్భంగా ఇదే పరంపర కొనసాగింది. బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కంటే ప్రస్తుతం విమర్శల నుంచి ఎలా తప్పించుకోవాలన్న అంశంపైనే ఎక్కువ సమయం చర్చించినట్లు సమాచారం.  కాగా, బయట జరిగిన ప్రచారం, మీడియాకు ఇచ్చిన లీకులకు విరుద్ధంగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తును వదులుకునే పరిస్థితి లేదని, ఏదోలా ఒత్తిడి తెచ్చి కొంతవరకైనా నిధులు సాధించుకోవడం తప్ప వేరే మార్గం లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం.  

ఆదివారం మీడియాతో సుజనా
‘‘బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంతో మాట్లాడాలని నిర్ణయించాం. చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌ చేయలేదు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరేతోనూ చంద్రబాబు మాట్లాడలేదు. బీజేపీ నుంచి విడిపోయే పరిస్థితి లేదు. ఎప్పుడైనా విడాకుల గురించి ఆలోచించకూడదు, ఎలా కలిసుండాలో ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు కఠిన నిర్ణయాలు వద్దని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలా సమన్వయం చేసుకోవాలో సర్వం తెలిసిన నాయకుడు చంద్రబాబు’’  

ఇవీ లీకులు..  
- బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం.  
తీవ్ర నిర్ణయం తీసుకుంటాం.. విడిపోయేందుకు సమయం ఆసన్నమైంది.   
ఎన్డీఏ సర్కారు నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక బీజేపీతో తెగతెంపులే.  
కేంద్ర ప్రభుత్వానికి మా తడాఖా చూపిస్తాం. ఇక యుద్ధానికి సన్నద్ధం.  
పార్లమెంట్‌లో సస్పెండయ్యే వరకూ పోరాటం చేస్తాం, తాడోపేడో తేల్చేస్తాం.  
రాజీనామాలకు రంగం సిద్ధం చేసుకున్న టీడీపీ ఎంపీలు.    

మీడియా సాక్షిగా మైకు ముందు..  
రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.  
అవసరమైతే పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం..   
ఎలాగైనా ఒత్తిడి తీసుకొచ్చి నిధులు సాధించుకోవడం తప్ప మరో మార్గం లేదు.   
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తును వదులుకోవడం సాధ్యం కాదు. ఆ పార్టీతో ఘర్షణ వద్దు.  
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు రాలేం.  
ఓవరాక్షన్‌ చేస్తే ఇబ్బందుల్లో పడతాం. రాజీనామాలు, నిరసనలు వద్దు. బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దు. 

మరిన్ని వార్తలు