తాడికొండ టీడీపీలో ముసలం

1 Oct, 2018 13:14 IST|Sakshi
అమీనాబాద్‌లో సమావేశమైన టీడీపీ అసమ్మతి నాయకులు (ఫైల్‌)

ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై భగ్గుమంటున్న తమ్ముళ్లు

నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన సెగలు

ఈసారి సీటిస్తే ఓడిస్తామంటున్న టీడీపీ నేతలు

చినబాబుకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమైన శ్రేణులు

గుంటూరు:  తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ తీరుపై నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో  అసంతృప్తి, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే పార్టీని నిమోజకవర్గంలో మూడు గ్రూపులుగా చీల్చి విభజించి పాలించు అన్న చందగా వ్యవహరిస్తున్నారని రగిలిపోతున్నారు. సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అసమ్మతి వర్గం నాయకులంతా ఏకమయ్యారు. కమిటీగా ఏర్పడి మళ్లీ శ్రావణ్‌కుమార్‌కు టికెట్‌ ఇస్తే ఓడిస్తామని అంటున్నారు. ఈ మేరకు ఇటీవల ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌లో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సమావేశమై తిరుగుబాటుకు సిద్ధమైంది. సమస్యను చిన్నబాబు దృష్టికి తీసుకెళ్లాలని నాయకులంతా నిర్ణయించారు.

విభేదాలు, వర్గాలు ఏర్పడిందిలా...
తుళ్లూరు మండలంలో స్థానికంగా ఉంటున్న జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ పూర్ణచంద్రరావు వర్గానికి చెందిన వారు ఇసుక విక్రయాలు ప్రారంభించారు. అప్పట్లో ఎమ్మెల్యే వారికి సహకరించారు. కొద్ది రోజుల తర్వాత ఇసుక విక్రయాలు నిలపేయాలని ఆదేశాలు రావడంతో పూర్ణచంద్రరావు వర్గం ఎమ్మెల్యేకు దూరమైంది. తాడికొండ మండలంలో డిస్టిలరీ కమిటీ చైర్మన్‌ పదవి పూర్ణచంద్రరావు సూచించిన వ్యక్తికి కాకుండా.. ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చారు. ఇక్కడా రెండు గ్రూపులు ఏర్పడ్డాయి.

అన్ని చోట్లా అదే తీరు
ఇటీవల తాడికొండ బస్టాండ్‌ సెంటర్‌లో పంచాయితీ నిధులతో నిర్మించిన గదులను ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇవ్వాలని యత్నించారు. అయితే గదులు కేటాయించిన లబ్ధిదారుల నుంచి రూ 1.5 లక్షలు వసూలు చేసి ఆ డబ్బును ఎమ్మెల్యే వర్గం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో వ్యతిరేక వర్గం వారు గదుల కేటాయింపును అడ్డుకున్నారు. మేడికొండూరు మండలంలో ఎమ్మెల్యే అనుకూల వర్గీయులు ప్రభుత్వ పథకాల్లో తమ వారికి ప్రాధాన్యమివ్వడంతో రెండు నెలల క్రితం సిరిపురానికి చెందిన ఎంపీటీసీలు ఇందిర, ప్రశాంతి రాజీనామాకు సిద్ధపడ్డారు. కొద్ది నెలల క్రితం ఫిరంగిపురం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవిని తాను కోరిన వ్యక్తికి ఇవ్వాలని మేడికొండూరు జెడ్పీటీసీ సాంబశివరావు ఎమ్మెల్యేను కోరారు. దీనికి ఎమ్మెల్యే నిరాకరించారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తూ జెడ్పీ సీఈవోకు సాంబశివరావు అప్పట్లో లేఖ అందజేశారు. నాలుగేళ్ల క్రితం ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌ గ్రామానికి చెందిన బత్తుల ప్రసాద్‌ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అయన ఎమ్మెల్యేకు దూరమయ్యారు. మంత్రి లోకేష్‌బాబుతో ఈయనకు సన్నిత సంబంధాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఫిరంగిపురం మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవిని ఎమ్మెల్యే తనకు అనుకూలమైన ముస్లిం నేతకు అప్పగించారు. దీంతో స్థానిక టీడీపీ సీనియర్‌ నాయకులు ఎమ్మెల్యేకు దూరమయ్యారు.

మళ్లీ టికెట్‌ ఇస్తే సహకరించం.
ఇటీవల అమీనాబాద్‌లో నిర్వహించన అసమ్మతి నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు సహకరించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిని నిలుపుతామని భీష్మించారు. ఈ విషయాన్ని లోకేష్‌(చిన్నబాబు) దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. 

మరిన్ని వార్తలు