ఎమ్మెల్యే రోజాపై దాడికి యత్నం

5 Jul, 2018 03:03 IST|Sakshi
ఎమ్మెల్యే రోజాపై దాడి చేయడానికి చుట్టుముట్టిన టీడీపీ అల్లరిమూకలు

     పుత్తూరు ఆస్పత్రి భవనాల ప్రారంభానికి వెళుతుండగా ఘటన   

     ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి అమర్, ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ

     ముద్దుకృష్ణమ తనయుల ఆధిపత్య పోరుతో రోడ్డునపడిన టీడీపీ

     రాజనీతి ప్రదర్శించిన ఎమ్మెల్యే రోజా  

పుత్తూరు: నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు ఆర్‌కే రోజాపై అధికార టీడీపీకి చెందిన అల్లరిమూకలు దాడికి యత్నించాయి. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన భవనాలను బుధవారం ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు మద్యం మత్తులో ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించాయి. టీడీపీ అల్లరిమూకల చర్యలతో ఆస్పత్రి ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. మరోవైపు దివంగత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుల మధ్య ఆధిపత్య పోరుకు ఆస్పత్రి నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం వేదికైంది. రాష్ట్రమంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి సమక్షంలోనే ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడికి ప్రయత్నించడంతో ఆ పార్టీ వర్గాలు విస్తుపోయాయి.

పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితిని తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎమ్మెల్యే రోజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నూతన భవనాల కోసం రూ.1.75 కోట్లు మంజూరు చేసింది. ఆ భవనాల ప్రారంభోత్సవాన్ని అధికారులు బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రోజా అధ్యక్షత వహించగా, మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి, గాలి సరస్వతమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ముద్దుకృష్ణమనాయుడు ఇద్దరు కుమారులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్‌ వారి అనుచర వర్గాలతో భారీ సంఖ్యలో అక్కడికి చేరారు. ఎమ్మెల్యే రోజా పంచాయతీరాజ్‌ అతిథి గృహం నుంచి పాదయాత్రగా వేదిక వద్దకు చేరుకున్నారు.

ఆ సమయంలో టీడీపీ నాయకులు దివంగత మద్దుకృష్ణమ పేరుతో నినాదాలు చేయగా, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జై జగన్‌ అంటూ నినాదాలిచ్చారు. ఇంతలో టీడీపీకి చెందిన అల్లరి మూకలు మద్యం మత్తులో ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమెను చుట్టుముట్టారు. ఒక దశలో చేతులు పైకెత్తి ఎమ్మెల్యేపై దాడికి దూసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే రోజా గన్‌మాన్‌ తుపాకి గాలిలోకి ఎక్కుపెట్టి హెచ్చరించారు. మరో వైపు  గాలి భానుప్రకాష్‌ వర్గీయులు గాలి జగదీష్‌పైకి దూసుకు వచ్చారు.  ఎమ్మెల్యే రోజా గాలి జగదీష్‌ను తనవైపునకు రమ్మని రక్షణనిచ్చారు.  అల్లరి మూకలు రెచ్చగొట్టినా ఎమ్మెల్యే రోజా  సంయమనం పాటించి నేతలందరినీ సన్మానించి రాజనీతి ప్రదర్శించారు. 

రాష్ట్రంలో చంద్రబాబు డ్రామా కంపెనీ 
నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ఇప్పుడు దొంగదీక్షలు చేస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కొత్తడ్రామాకు తెరసీందని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విమర్శించారు. పుత్తూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని నాలుగేళ్లుగా పోరాడకుండా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ చేత దొంగదీక్ష చేయించారని ఆరోపించారు. ఆయన చేసిన నిరాహారదీక్షకు సంబంధించి మెడికల్‌ రిపోర్టులను బహిర్గతం చేయాలని రోజా డిమాండ్‌ చేశారు. చేతనైతే ఎంపీలతో రాజీనామా చేయించి ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్షలు చేయాలని ఆమె చంద్రబాబునాయుడుకు సవాల్‌ విసిరారు. అలాకాకుండా చీకట్లో ప్రధానిమోదీ, అమిత్‌షా కాళ్లు పట్టుకుంటూ రాష్ట్రంలో దీక్షలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

మరిన్ని వార్తలు