కుక్కనైనా నిలబెట్టండి.. కోడెల మాత్రం వద్దు 

14 Mar, 2019 05:00 IST|Sakshi
సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న అసమ్మతి వర్గం

సత్తెనపల్లిలో స్పీకర్‌ కోడెలకు స్థానిక టీడీపీ శ్రేణుల నుంచి అసమ్మతి సెగ

కోడెలకు సత్తెనపల్లి సీటు ఇవ్వవద్దంటూ నియోజకవర్గ పార్టీ ఆఫీస్‌లో నిరసన

‘కె’ ట్యాక్స్‌లు కట్టడం తమ వల్ల కాదంటూ గగ్గోలు

కోడెల అధికారంలో.. దూడల పెత్తనంతో విసిగిపోయామని వెల్లడి

తమను కాదని కోడెలకు టికెట్‌ ఇస్తే వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమన్న స్థానిక నేతలు  

సాక్షి, గుంటూరు/సత్తెనపల్లి: ‘‘ఐదేళ్ల నుంచి ఇదే బతుకు. తోపుడు బండి నుంచి పరిశ్రమల వరకూ ప్రతి దానికీ ‘కె’ ట్యాక్స్‌ వేస్తున్నారు. ఈ అక్రమ ట్యాక్స్‌లు కట్టడం మా వల్ల కాదు. కోడెల అధికారంలో.. దూడల పెత్తనంతో మా పరిస్థితి దారుణంగా మారింది. కుక్కను నిలబెట్టినా గెలిపించేందుకు కృషి చేస్తాం గానీ కోడెలకు మాత్రం ఓటేయలేం’’ అంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు తేల్చిచెప్పారు. సత్తెనపల్లి టికెట్‌ కోడెలకు ఇవ్వొద్దంటూ పట్టణంలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు బుధవారం ఆందోళనకు దిగారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్‌ నేత గోగినేని కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు పెద్దింటి వెంకటేశ్వర్లు, కోమటినేని శ్రీనివాసరావు, సంగం డెయిరీ డైరెక్టర్‌ పోపూరి కృష్ణారావు తదితరులు ఈ నిరసనలో పాల్గొని కోడెల వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

సొంత పార్టీ వారని కూడా చూడలేదు..
సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కోడెల గెలుపొందినప్పటి నుంచి ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి నియోజకవర్గంలో ఎవరినీ వదలకుండా ‘కె’ ట్యాక్స్‌ వసూలు చేశారని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ వారని కూడా చూడకుండా లంచాలు వసూలు చేశారని మండిపడ్డారు. కోడెల కుటుంబం తీరుతో ఈ ఐదేళ్లలో బాగా విసిగిపోయాం. మళ్లీ వారికే సత్తెనపల్లి టికెట్‌ ఇస్తే నియోజకవర్గంలో ఎవరినీ బతకనీయరని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల కొడుకు, కుమార్తె ఇద్దరూ కలిసి నరసరావుపేట, సత్తెనపల్లి రెండు నియోజకవర్గాలను తమ గుప్పెట్లో పెట్టుకుని అరాచకాలు, దౌర్జన్యకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఇంకా కోడెలకు ఎక్కడా సీటు ఖరారు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కోడెలకు మళ్లీ సత్తెనపల్లి టికెట్‌ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తుండటంతో.. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలంతా రోడ్డెక్కారు. కుక్కనైనా నిలబెట్టండి గానీ.. కోడెల వద్దని స్పష్టం చేస్తున్నారు.

బుజ్జగింపులూ ఫలించ లేదు..
టీడీపీ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న నాయకులను బుజ్జగించడానికి కోడెల శివప్రసాదరావు.. మున్సిపల్‌ చైర్మన్‌ యెల్లినేడి రామస్వామి, ఏఎంసీ చైర్మన్‌ సయ్యద్‌ పెదకరీముల్లా, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆళ్ల సాంబయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చౌటా శ్రీనివాసరావు, సత్తెనపల్లి టీడీపీ ప్రధాన కార్యదర్శి మస్తాన్‌వలి, న్యాయవాది  రాజు తదితరులను పంపారు. అయినా అసమ్మతి నేతలు వెనక్కి తగ్గలేదు. కోడెలకు మద్దతుగా వచ్చిన నాయకులను దూషించి వెనక్కి పంపించేశారు. బుధవారం రాత్రి సైతం ‘క్విట్‌ కోడెల.. సేవ్‌ సత్తెనపల్లి’ అంటూ టీడీపీ కార్యాలయంపై క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలియజేశారు.   

అంబటి గెలుపు ఖాయం..
తమ మాట కాదని కోడెలకు టికెట్‌ ఇస్తే ఆయన ఓటమిపాలవ్వడం ఖాయమని.. వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు 20 వేల మెజారిటీతో గెలుపొంది తీరుతారని కోడెల వ్యతిరేకవర్గం తేల్చి చెప్పింది. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకొని కార్యకర్తల మనోభావాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్‌ చేశారు. మరోవైపు తనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులు చేస్తున్న నిరసనలు ప్రసారం కాకుండా నియోజకవర్గంలో కేబుల్‌ టీవీ ప్రసారాలను కోడెల నిలిపివేయించారు.

మరిన్ని వార్తలు