108కి దారివ్వని టీడీపీ కార్యకర్తలు

20 Feb, 2020 04:29 IST|Sakshi
చంద్రబాబు ఉన్నారంటూ టీడీపీ కార్యకర్తలు దారివ్వకపోవడంతో వెనక్కి వెళ్తున్న 108 వాహనం

ప్రమాదంలో గాయపడ్డ బిహార్‌ కార్మికుడి అవస్థలు 

6 కి.మీ. దూరానికి 15 కి.మీ. ప్రయాణించిన అంబులెన్స్‌ 

మార్టూరులో చంద్రబాబు కార్యక్రమం ఉందంటూ అడ్డుకున్న నేతలు

మార్టూరు: ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకునే 108 వాహనం కనిపిస్తే ఎవరైనా మానవత్వంతో దారి ఇస్తారు. రోగి ప్రాణాలను రక్షించాలంటే ప్రతి నిమిషమూ ఎంతో విలువైనదే. ప్రతిపక్ష నేత చంద్రబాబు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రలో తొలిరోజు మార్టూరులో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ గాయపడ్డ ఓ కార్మికుడిని ఆస్పత్రికి తరలించేందుకు వెళ్తున్న 108ని అడ్డుకోవడంతోపాటు తిరుగు ప్రయాణంలో సైతం క్షతగాత్రుడితో ఉన్న వాహనానికి కూడా టీడీపీ కార్యకర్తలు దారి ఇవ్వకపోవడం గమనార్హం. ఫలితంగా 6 కి.మీ మాత్రమే ప్రయాణించాల్సిన 108 వాహనం 15 కి.మీ దూరం తిరగాల్సి వచ్చింది. అరగంటకుపైగా సమయం వృథా అయింది. 

ఏం జరిగిందంటే...?
జొన్నతాళి సమీపంలోని ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో గ్రానైట్‌ శ్లాబులు లారీకి లోడ్‌ చేస్తుండగా బిహార్‌కు చెందిన కార్మికుడు సూరజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్తుండగా స్టేట్‌ బ్యాంకు సెంటర్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు యాత్ర ఉన్నందున ఇటు నుంచి వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పారు. దీంతో 108 సిబ్బంది గత్యంతరం లేక సర్వీస్‌ రోడ్డులో చుట్టూ తిరిగి ఇసుక దర్శి మీదుగా జొన్నతాళి చేరుకున్నారు. 

తిరుగు ప్రయాణంలోనూ క్షతగాత్రుడిని వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్న 108 సిబ్బందిని తిరుగు ప్రయాణంలోనూ మార్టూరులో టీడీపీ కార్యకర్తలు మరోసారి అడ్డగించారు. చంద్రబాబు మీటింగ్‌ పూర్తి కాలేదంటూ వాహనానికి దారి ఇచ్చేందుకు నిరాకరించారు. రోగి పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించిన 108 సిబ్బందిని దూషిస్తూ మిమ్మల్ని వైఎస్సార్‌ సీపీ నాయకులు పంపించారా? అంటూ ప్రశ్నించారు. తమకు రాజకీయాలతో నిమిత్తం లేదని, బాధితులను ఆస్పత్రికి తరలించి ఆదుకోవటమే తమ బాధ్యతని చెప్పినా వినిపించుకోకపోవడంతో చేసేదేమీ లేక 108 వాహనంలో తిరిగి జొన్నతాళి మీదుగా ఇసుక దర్శి అండర్‌పాస్‌ కింద నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని బాధితుడిని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు