బాధితుల ముసుగులో శవ రాజకీయం

10 May, 2020 03:38 IST|Sakshi
కంపెనీ ఎదుట మృతదేహాలతో ఆందోళన చేస్తున్న దృశ్యం

ఎల్జీ పాలిమర్స్‌ వద్ద మృతదేహాలతో టీడీపీ, జనసేన కార్యకర్తల ధర్నా 

ఎండీ చాంబర్‌లోకి చొచ్చుకువచ్చి దాడికి యత్నం 

వాస్తవ బాధితులకు సర్ది చెప్పిన పోలీసులు, మంత్రులు 

చేసేది లేక వెనుదిరిగిన టీడీపీ నాయకులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సింహాచలం: ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితుల ముసుగులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. కంపెనీ ముందు శవ రాజకీయాలకు దిగాయి. నిజమైన బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదనే ఉద్దేశంతో పోలీసులు సంయమనంతో వ్యవహరించడాన్ని అలుసుగా తీసుకున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులపై రాళ్లు రువ్వాయి. అయినప్పటికీ పోలీసులు ఓపిగ్గా బాధితులకు నచ్చజెప్పడానికే ప్రయత్నించారు. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కంపెనీ పట్టించుకోదా?
► ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకై 12 మంది మృతి చెందడంతో బాధితులు శనివారం కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం మూడు మృతదేహాలతో ధర్నాకు దిగారు. ప్రమాదానికి కారణమైన కంపెనీని జనావాసాల మధ్య నుంచి తరలించాలని డిమాండ్‌ చేశారు. 
► యాజమాన్య ప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. కంపెనీ నిర్లక్ష్యానికి ప్రభుత్వం భారీ నష్టపరిహారాన్ని ప్రకటించినా, యాజమాన్యం కనీసం తమని పట్టించుకోకపోవడం పట్ల మండిపడ్డారు.

టీడీపీ శ్రేణుల రాకతో ఉద్రిక్తత 
► అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన ఆందోళన టీడీపీ నేతల రాకతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. బాధితుల ముసుగులో జనసేన, టీడీపీ నేతలు రెచ్చిపోయారు. 
► అప్పటి వరకు కంపెనీ యాజమాన్యానికి వ్యతిరేకంగా బాధితులు ఆందోళన చేపడితే.. టీడీపీ నేతలు ఒక్కసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు, నినాదాలు చేయడంతో బాధితుల గోడు రాజకీయ రంగు పులుముకుంది. దీంతో నిజమైన బాధితుల డిమాండ్లు పక్కకుపోవడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు.
► ఇంతలో జనసేన, టీడీపీ మరింత రెచ్చిపోయారు. ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులపై రాళ్లు రువ్వారు. కంపెనీ గేట్లు దూకి లోపలకు దూసుకొచ్చారు. దీంతో కొంత సేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
► కంపెనీలో పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అప్పటికే సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన కంపెనీలో ఉండగానే టీడీపీ నేతలు బయట రెచ్చిపోయారు. డీజీపీని, ఇతర పోలీసు ఉన్నతాధికారులను అక్కడ నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఒక దశలో వారిపై కూడా తిరగబడ్డారు. 
► అయినప్పటికీ పోలీసులు తమ పంథాకు వ్యతిరేకంగా వ్యవహరించారు. తమ అధికారాన్ని ఏ మాత్రం ప్రదర్శించలేదు. ఓపికగా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. 

ప్రజా శ్రేయస్సే ముఖ్యం..
► సంఘటనా స్థలానికి మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, గుమ్మలూరి జయరాం చేరుకున్నారు. నిజమైన బాధితులు, మృతుల కుటుంబీకులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా తమకు పరిహారంతో పాటు తక్షణ వైద్య సహాయం అందిందనీ.. అయితే కంపెనీ యాజమాన్యం మాత్రం ఇంత వరకూ పట్టించుకోలేదనే కోపంతోనే రోడ్డెక్కామని చెప్పారు.
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల సంక్షేమం, శ్రేయస్సే ముఖ్యమని, నిబంధనలకు విరుద్ధంగా, నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలకు హాని చేసే బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు కాదని మంత్రి ముత్తంశెట్టి బాధితులకు స్పష్టం చేశారు. స్థానిక గ్రామ ప్రజల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పారు.
► ఇప్పటికే కంపెనీలో జరిగిన ప్రమాదంపైనే కాకుండా, భవిష్యత్తు పరిణామాలపై కూడా విచారణ చేపట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వారికి వివరించారు. ఆ కమిటీల నివేదికల ఆధారంగా ప్రజలకు మేలు జరిగే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులు బాధితులకు హామీ ఇచ్చారు. దీంతో బాధితులు, మృతుల కుటుంబీకులు ఆందోళన విరమించారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు చేసేదేమీ లేక వెనుదిరిగారు.

మరిన్ని వార్తలు