పొత్తులు.. గమ్మత్తులు

12 Mar, 2020 13:14 IST|Sakshi
జనసేన, టీడీపీ కండువాలు కప్పుకుని నామినేషన్‌ వేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థి నల్లా రమాదేవి

తూర్పుగోదావరి, అమలాపురం: ఈ ఫోటో చూశారా? ఉప్పలగుప్తం మండలం ఎంపీటీసీ స్థానానికి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం నామినేషన్‌ వేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థి నల్లా రమాదేవి. ఇందులో విషయం ఏముందని అనుకుంటున్నారా...తన పార్టీ కండువాతోపాటు టీడీపీ కండువా కూడా వేసుకుని ఆమె నామినేషన్‌ దాఖలు చేయడంతో చూసినవారు ‘అమ్మ...రాజకీయం’ అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఆమెకు మద్దతుగా టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచి గుంటు ఫణిప్రసాద్‌ పక్కనే ఉండి నామినేషన్‌ పత్రాలు అందజేయడాన్ని చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు.

ఒక్క విలసవిల్లిలోనే కాదు. నియోజకవర్గంలోని అమలాపురం, అల్లవరం, ఉప్పల గుప్తం మండలాలనే తేడా లేకుండా అన్నిచో ట్లా స్థానిక సంస్థలఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు తెరవెనుక పొత్తులు పెట్టుకుంటున్నాయి. ‘మీకు ఇది...మాకు ఇది’ అనే పద్ధతిలో ‘జెడ్పీటీసీ మీకు...ఎంపీపీ మాకు...ఒక ఎంపీటీసీ మీకు.. ఒక ఎంపీటీసీ’ మాకు అంటూ వాటాలు పంచుకున్నట్టు ఎంపీటీసీ స్థానాలు పంచుకుంటున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం..ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల నేపథ్యంలో గెలుపు దీమా లేక ఇరుపార్టీలు ఇలా స్థానాలు పంచుకున్నాయి. టీడీపీ అగ్రనేతలు జనసేనతో పొత్తు ఉండదని ఒకవైపు చెబుతూనే మరోవైపు ఇలా తెరవెనుక రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఉప్పలగుప్తం మండలంలో ఒక్క విలసవిల్లి ఎంపీటీసీ స్థానానికే కాదు ఈ మండలంలో ఉన్న ఎంపీటీసీ స్థానాలన్నింటినీ ఈ రెండు పార్టీలు పంచుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. విలసవిల్లితోపాటు పక్కనే ఉన్న భీమనపల్లిలో ఒక ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీకి వదిలేయాలని జనసేన నిర్ణయించుకుంది. మునిపల్లి, వానపల్లిపాలెం కలిపి ఉన్న ఎంపీటీసీ స్థానంలో జనసేనకు వదిలేయాలని టీడీపీ తీర్మానించింది.

మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్సార్‌సీపీ 17చోట్ల నామినేషన్లు వేసింది. టీడీపీ తరఫున 13 మంది, జనసేన తరపున తొమ్మిది చోట్ల తమ అభ్యర్థులను నిలిపారు. మూడు స్థానాల్లో అనధికారికంగా పొత్తు కుదుర్చుకోగా, మరో ఐదు చోట్ల కుదిరే అవకాశముందని సమాచారం. అమలాపురం మండలంలో జి.అగ్రహారం ఎంపీటీసీ స్థానంలో టీడీపీకి జనసేన మద్దతు ఇస్తుంది. ఇందుపల్లిలో జనసేనకు టీడీపీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. బండారులంకలో మూడు ఎంపీటీసీలు ఉండగా, రెండు చోట్ల టీడీపీ, ఒక చోట జనసేన పరస్పరం సహకరించుకోనున్నాయి. ఈదరపల్లిలో ఒక స్థానంలో టీడీపీ, మరో స్థానంలో జనసేన పంచుకున్నాయి. పేరూరులో నాలుగు స్థానాలకుగాను టీడీపీ రెండు, జనసేన రెండు చొప్పున పంచుకున్నారు. జనుపల్లిలో టీడీపీ, జనసేన ర్యాలీగా కలిసి వచ్చి జనసేన అభ్యర్థికి మద్దతుగా నామినేషన్‌ వేయగడం గమనార్హం. అల్లవరం మండలం డి.రావులపాలెం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి తిక్కా శేషుబాబుకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మండలంలో సర్పంచ్‌ల నామినేషన్లు పూర్తయిన తరువాత ఈ రెండు పార్టీల మధ్య మరిన్ని పొత్తులు ఖరారయ్యే అవకాశముంది. ముఖ్యంగా అధికార టీడీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావకపోవడంతో ఇలా తెరవెనుక పొత్తులకు వెంపర్లాడుతోంది. ఇది చూసి టీడీపీ అభిమానులే ముక్కు వేలు వేసుకుంటున్నారు. 37 ఏళ్ల అనుభవం... 24 ఏళ్ల అధికారంలో ఉన్న ఉన్న రాజకీయ పార్టీ టీడీపీ ఇప్పుడున్న గడ్డుస్థితిని గతంలో ఎన్నడూ ఎదుర్కొలేదని టీడీపీ అనుకూలురే వాపోతున్నారు.

మరిన్ని వార్తలు