నయానో.. భయానో ఇచ్చేయండి

8 Apr, 2019 11:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికలకు మరో మూడు రోజులే గడువు ఉండటంతో అభ్యర్థులు వేగం పెంచారు. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం ప్రతిపక్షం ఆత్మ స్థైర్యం దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోంది. పార్టీ నాయకులను, కార్యకర్తలను నయానో..భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడుతోంది.

ఎంతకైనా తెగిస్తూ..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంతకైనా తెగించేందుకు టీడీపీ నేతలు, శ్రేణులు సిద్ధమయ్యారు. తిరువూరులో మంత్రి జవహర్‌ గెలుపు కోసం బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో అక్కపాలెం అనే గ్రామంలో సర్పంచ్‌ భర్త నాగేశ్వరరావును టీడీపీ గూండాలు హత్య చేశారు. ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పనిచేస్తే నాగేశ్వరరావు వద్దకు పంపుతామంటూ హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలోని నాయకులు ఈ విషయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రక్షణ నిధి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తాను అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో పార్టీ శ్రేణులు పనిచేయడం ప్రారంభించాయి. 

  • జగ్గయ్యపేటలో ఒక బీఎల్‌ఓను టీడీపీ అభ్యర్థులు బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఆ బీఎల్‌ఓకు అండగా నిలబడ్డారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నించగా.. తమకు ఏమీ జరగలేదని బీఎల్‌ఓ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. 
  • విజయవాడలో ఒక వైద్యుడిపై టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు అందరి ముందు వీరంగం వేసిన విషయం అందరికి తెలిసిందే.. అసభ్య పదజాలంతో ఆయన్ను దూషించడంతో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది పెద్ద వివాదం కావడంతో చివరకు ఆ వైద్యుడిని తన ఇంటికి పిలిపించుకుని బొండా సెటిల్‌ చేసుకున్నారు.
  • ఇక గుడివాడలో టీడీపీ అభ్యర్థి, ఆయన అనుచరులను చూస్తుంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారిలో ఉన్న వర్గ తగాదాలకే ఒక యువకుడు అనుమానస్పదంగా మృతి చెందాడు. టీడీపీ నాయకులు బెదిరింపులకు భయపడవద్దని, వారిని ఎదుర్కొవాల్సి వస్తే తానే ముందుకు ప్రాణాలను ఫణంగా పెడతానని అక్కడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోడాలి శ్రీవెంకటేశ్వరరావు ప్రకటించారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 
  • గన్నవరంలోనూ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమాత్రం లేదు. గ్రామాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు టీడీపీ అభ్యర్థి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ప్రతిపక్ష కార్యకర్తలను బంధించి పెట్టుకుని ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది 
  • మైలవరంలో గెలుపుకోసం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు బెదిరింపులకు దిగుతున్నారు. ఇటీవల ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ఆయన సభను భగ్నం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆయన అనుచరులు అంగబలం, ఆర్థికబలంతో గ్రామాల్లో ప్రతిపక్ష కార్యకర్తలను లొంగదీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్‌కాంగ్రెస్‌ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ అడుగడుగునా అడ్డుకుంటున్నారు. 

గ్రామాల్లో జన్మభూమి కమిటీ బెదిరింపులు..
గత నాలుగున్నర ఏళ్లుగా గ్రామాల్లో పెత్తనం సాగించిన జన్మభూమి కమిటీలు ఇప్పుడు ఏ మాత్రం తగ్గడం లేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినా ఓటు వేసినా వారి తెల్లకార్డులు, పింఛన్లు రద్దు చేయిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్నికలు అయిన తర్వాత నెల రోజుల వరకు కౌంటింగ్‌ జరగదని ఈ లోగా తమ ప్రభుత్వం పింఛన్లు, కార్డులను రద్దు చేయిస్తామంటూ మైలవరం, నందిగామ, అవనిగడ్డ నియోజకవర్గ గ్రామాల్లో జోరుగా బెదిరింపులకు దిగుతున్నారు.

గత ఐదేళ్లుగా వారి పెత్తనం చూసిన గ్రామస్తులు ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒకవైపు ఎన్నికల ప్రచారం చేసుకుంటూ మరోకవైపు తమ పార్టీ శ్రేణుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

మరిన్ని వార్తలు