‘టీడీపీ డ్రామాలకు వెరవం.. పాదయాత్ర ఆపం’

28 Jul, 2018 16:12 IST|Sakshi
హిందుత్వ జేఏసీ చైర్మన్‌ శివస్వామి

సాక్షి, అమరావతి: చంద్రబాబు హిందుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ హిందూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహా పాదయాత్రను అడ్డుకోవడానికి అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని జేఏసీ చైర్మన్‌ శివస్వామి ఆరోపించారు. నాలుగేళ్లుగా అధికారం చలాయిస్తున్న టీడీపీ ప్రభుత్వం హిందూవ్యతిరేక చర్యల్ని ప్రజలకు వివరించడానికే పాదయాత్ర తలపెట్టామని ఆయన అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూలై 29న విజయవాడ దుర్గా గుడి నుంచి ప్రారంభమై ఆగస్టు 12న తిరుపతిలో ఈ పాదయాత్ర పూర్తవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం పాదయాత్రకు అనుమతినివ్వడం లేదనీ, అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆయన వాపోయారు.
 
హిందుత్వ వ్యతిరేక చర్యలను ప్రశ్నించినందువల్లే గత నాలుగేళ్లుగా ప్రభుత్వం తనను వేధింపులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తాను అసైన్డ్‌ భూములను లాక్కొన్నానంటూ టీడీపీ ఆధ్వర్యంలో కొందరు ధర్నా కూడా చేపట్టారని ఆయన మండిపడ్డారు. ఏదేమైనా పాదయాత్ర చేసి తీరుతామని ఆయన ఉద్ఘాటించారు. కాగా, పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శైవక్షేత్రం చుట్టూ పోలీసులను మోహరించింది. ఈ పాదయాత్రలో శివస్వామితో పాటు మరో 30 మంది ఈ పాల్గొననున్నారు. 

మరిన్ని వార్తలు