టీడీపీలో వీడని ‘సీట్ల’ముడి

14 Mar, 2019 11:20 IST|Sakshi

ఇంకా 40 ఎమ్మెల్యే స్థానాలపై గందరగోళం

పలు ఎంపీ సీట్లపైనా స్పష్టత కరువు

చంద్రబాబు నివాసం వద్ద నేతల పడిగాపులు

అధినేత వైఖరితో నెత్తీనోరూ బాదుకుంటున్న ఆశావహులు

బాలకృష్ణ ఒత్తిడితో కనిగిరిలో ఉగ్రనరసింహారెడ్డికి ఎసరు?

డోన్‌ను పట్టుబడుతున్న కేఈ, కోట్ల

సాక్షి, అమరావతి/దర్శి: తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. నామినేషన్లకు గడువు ముంచుకొస్తున్నప్పటికీ పీటముడి వీడడంలేదు. 40కి పైగా ఎమ్మెల్యే, పది ఎంపీ సీట్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. పెండింగ్‌లో ఉంచిన ఈ స్థానాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఏ విషయం తేల్చకుండా నాన్చుతుండడంతో రేసులో ఉన్న నేతలంతా ఉండవల్లిలోని ప్రజావేదిక వద్దే పడిగాపులు కాస్తున్నారు. పలు స్థానాలకు సంబంధించిన నేతలను బుధవారం ఆయన పిలిపించి మాట్లాడినా ఎవరికీ స్పష్టత ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళనలో మునిగిపోయారు. మరికొన్ని సీట్లపైనా వేర్వేరు సమీకరణలు తీసుకువస్తుండడంతో ఆశావహులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో పాతపట్నం, విజయనగరం, భీమిలి, పాయకరావుపేట, పాలకొండ, కురుపాం, పాడేరు సీట్లను ఖరారు చేయలేదు. విజయనగరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీత, ఎంపీ అశోక్‌గజతిరాజు కుమార్తె అతిథిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంపై సాగదీస్తున్నారు.

పాతపట్నంలో కలమట వెంకటరమణపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో కలిశెట్టి అప్పలనాయుడు తదితరుల పేర్లను పరిశీలిస్తున్నా తుది నిర్ణయం తీసుకోలేదు. నిన్నటి వరకూ భీమిలిలో తన కొడుకు లోకేష్‌ పోటీచేస్తారని హడావుడి చేసినా ఇప్పుడు అదేమీ లేదని చెబుతున్నారు. అంతకుముందు గుంటూరు జిల్లా పెదకూరపాడు, కృష్ణా జిల్లా పెనమలూరు, అనంతపురం జిల్లా హిందూపురం సీట్లలోనూ ఆయన పోటీచేస్తారన్నారు. తాజాగా మంగళగిరిలో పోటీకి లోకేష్‌ సిద్ధమని టీడీపీ లీకులిస్తోంది. అయితే, ఈ లీకైనా నిజమవుతుందా అసలు లోకేష్‌ పోటీలో ఉంటారా, ఉండరా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న గంటాకు మళ్లీ ఆ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు అయిష్టత చూపుతుండడంతో గందరగోళం నెలకొంది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా ఎవరిని బరిలోకి దింపాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. నర్సీపట్నంలో తనకు కాకుండా తన కొడుక్కి అవకాశం ఇవ్వాలని మంత్రి అయ్యన్నపాత్రుడు గట్టిగా డిమాండ్‌ చేస్తుండడంతో దాన్ని పెండింగ్‌లో పెట్టారు. (చదవండి: జేసీ చిందులు.. శమంతకమణి కన్నీళ్లు)

చినరాజప్పకు టెన్షన్‌
ఉభయగోదావరి జిల్లాల్లోని అమలాపురం, రాజమండ్రి అర్బన్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, చింతలపూడి..జాగా పెద్దాపురం సీట్లపై అయోమయం ఏర్పడింది. పెద్దాపురం సీటును ఉపముఖ్యమంత్రి చినరాజప్పకు ఖరారు చేసినా మారిన సమీకరణల నేపథ్యంలో అక్కడ బొడ్డు భాస్కరరామారావు పేరును తెరపైకి తీసుకువచ్చారు. కొవ్వూరు సీటును మళ్లీ తనకే ఇవ్వాలని కోరుతున్న మంత్రి జవహర్‌ను డోలాయమానంలో ఉంచారు. పీతల సుజాతకు చింతలపూడి సీటును ఖరారు చేయకపోవడంతో ఆమె ఆందోళనలో ఉన్నారు. కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరు, పామర్రు, పెడన, తిరువూరు సీట్లపైనా సందిగ్ధత కొనసాగుతోంది. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కైకలూరు సీటును తనకుగానీ తన కొడుక్కిగానీ ఇవ్వాలని కోరుతుండడం, స్థానిక నేతలు జయమంగళ వెంకటరమణ తదితరులు తమకివ్వాలని పట్టుబడుతుండడంతో దాన్ని పెండింగ్‌లో ఉంచారు. పెడన సీటును సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండడంతో దానిపైనా నిర్ణయం తీసుకోలేదు. గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్ట్, ఈస్ట్, పత్తిపాడు, తాడికొండ, మాచర్ల, నర్సరావుపేట, బాపట్ల సీట్లతోపాటు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, చీరాల, దర్శి, కనిగిరి, యర్రగొండపాలెంపైనా సందిగ్ధం కొనసాగుతోంది. (చదవండి: నన్ను దెబ్బ కొట్టేందుకే తొలి విడతలో ఎన్నికలు)

కనిగిరిపై కొత్త ట్విస్ట్‌
ప్రకాశం జిల్లాలోని కనిగిరి సీటును కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఉగ్రనరసింహారెడ్డికి ఖరారు చేసినా బాలకృష్ణ ఒత్తిడితో మళ్లీ అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉగ్రనరసింహారెడ్డికి దర్శి కేటాయించి అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి శిద్దా రాఘవరావుకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనికి శిద్దా అంగీకరించకపోవడంతో దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఇక కర్నూలు జిల్లాలోని డోన్‌ సీటును ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు ప్రతాప్‌కు ఖరారు చేసినా ఇప్పుడు ఆ స్థానం కోసం కోట్ల సుజాతమ్మ పట్టుబడుతుండడం, అందుకు చంద్రబాబు సానుకూలంగా ఉండడంతో దీనిపైనా గందరగోళమే. ఆదోని, కోడూరు, ఆలూరు, నందికొట్కూరు, కర్నూలు స్థానాలపైనా స్పష్టత రాలేదు. కర్నూలు సీటు తమకే కావాలని ఎస్వీ మోహన్‌రెడ్డి, టీజీ భరత్‌ పట్టుబడుతున్నారు. కడప జిల్లాలో బద్వేలు, ప్రొద్దుటూరు, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, వెంకటగిరి, సత్యవేడు, తంబళ్లపల్లి, మదనపల్లి నగిరి, చిత్తూరు, పూతలపట్టు, అనంతపురం జిల్లాలో గుంతకల్లు, సింగనమల, కళ్యాణదుర్గం సీట్లపై సందిగ్ధం వీడలేదు.

ఎంపీ సీట్లపైనా టెన్షన్‌
ఎంపీ సీట్లపైనా తీవ్ర అయోమయం నెలకొంది. అనకాపల్లి, విశాఖ, రాజమండ్రి, అమలాపురం, నర్సాపురం, నర్సరావుపేట, రాజంపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, నెల్లూరు సీట్లలో ఎవరిని పోటీచేయించాలన్న దానిపై చంద్రబాబు ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. విశాఖను బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కు ఖరారు చేసినట్లు లీకులిచ్చినా దానిపైనా స్పష్టత రాలేదు. అనకాపల్లి నుంచి పోటీచేయాలని మంత్రి గంటాపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సృష్టిస్తున్న గందరగోళంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. కాగా, శిద్దా రాఘవరావును వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానం నుంచి బరిలో నిలపాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు బుధవారం దర్శిలోని శివరాజనగర్‌లో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన చేపట్టారు.

సీఎం ఇంటి వద్ద డిష్యూం డిష్యూం
అభ్యర్థుల ఎంపికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు సాగదీస్తుంటే మరోవైపు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్దే ఘర్షణలకు దిగుతున్నారు. పలు నియోజకవర్గాలకు చెందిన నాయకుల అనుచరులు బుధవారం బలప్రదర్శనకు దిగి నానా హంగామా సృష్టించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అనంతపురం సీటు ప్రభాకర్‌చౌదరికి ఇవ్వొద్దని సత్యనారాయణ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రభాకర్‌చౌదరికి బదులు బలిజలకు ఆ సీటు ఇవ్వాలని, అతను తమను అణచివేస్తున్నాడని ఆరోపించారు. అలాగే, పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కుర్చీలు విసురుకుని భారీకేడ్లు తోసివేసి మరీ కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని తోసుకున్నారు. 

మరిన్ని వార్తలు