జనసేన కోసం టీడీపీ అభ్యర్థుల మార్పులు!

18 Mar, 2019 20:26 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా జనసేన, టీడీపీల చీకటి ఒప్పందం బయటపడుతోంది. పైకి పొత్తుల్లేవంటూనే రహస్య ఒప్పందాలతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల కేటాయింపు విషయంలో ఒకరికిఒకరు సహాయం చేసుకుంటూ ప్రత్యర్థులను ఓడించడానికి ఎత్తులు వేస్తున్నారు. జనసేన కోసం టీడీపీ అభ్యర్థుల కేటాయింపుల్లో భారీ మార్పులు చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులను జనసేన కోసం మారుస్తోంది. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరపున నాగబాబు బరిలోకి దిగుతుండడంతో టీడీపీ అక్కడ బలహీన అభ్యర్థిని పెట్టడానికి చర్చలు జరుపుతోంది.

నాలుగు రోజుల క్రితం నరసాపురం ఎంపీ అభ్యర్థిగా చైతన్య రాజును ప్రకటిస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు... జనసేన కోసం ఆయనను తప్పించారు. ఇప్పుడు ఆ స్థానంలో ఎమ్మెల్యే శివను పెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇష్టం లేకపోయినా బలవంతంగా శివను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు వస్తున్నారని చైతన్యరాజుని తప్పుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. జనసేన మరో అభ్యర్థి నాదేండ్ల మనోహర్‌ కోసం తెనాలి అభ్యర్థిని మర్చినట్లు తెలుస్తోంది. తెనాలి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆలపాటి రాజాను ఎంపీగా పోటీ చేయమని ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్‌ కోసం టీడీపీ అభ్యర్థి మద్దాల గిరిని మారుస్తున్నారు. తొలుత గుంటూరు స్థానాన్ని​ మద్దాల గిరికి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను నర్సరావుపేటకు వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

జనసేన వింత పొత్తులు.. లోకేష్‌పై పోటీకి దూరం

ఇక పవన్‌ కల్యాణ్‌ కోసం గాజువాక ఎమ్మెల్యేకు చంద్రబాబు ఝలక్‌ ఇచ్చారు. పవన్‌కల్యాణ్, లక్ష్మీనారాయణలు పోటీచేయవచ్చని ప్రచారం జరుగుతున్న గాజువాక, భీమిలి, పెందుర్తి తదితర సీట్లకు చంద్రబాబు తన అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. వాళ్లిద్దరూ పోటీచేసే నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి పరోక్షంగా వాళ్లకు సహకరించేందుకే చంద్రబాబు ఆయా స్థానాలను ప్రకటించలేదని తెలుస్తోంది. ఇక జనసేన కూడా డమ్మీ అభ్యర్థులను పెట్టి టీడీపీకి సహకరిస్తోంది. మంత్రి నారా లోకేష్‌ కోసం మంగళగిరి స్థానంలో పోటీకి దూరంగా ఉంది. ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపైనా పోటీకి జనసేన దూరంగా ఉంటోంది. విజయవాడ సెంట్రల్‌ సీటును కూడా సీపీఎంకు ఇచ్చింది.

మరిన్ని వార్తలు