ఓట్లడగడానికి వస్తే ముఖాలు పగులకొట్టండి

22 Nov, 2018 13:38 IST|Sakshi
ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న పీజీ వెంకటేష్‌

టీడీపీ నేతలు అర్హత కోల్పోయారు

మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు

చంద్రబాబు మరోసారి మోసగించడానికి సిద్ధమయ్యారు

జాతీయ మత్స్యకారుల సంఘం నేత పీజీ వెంకటేష్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): ‘గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ మత్స్యకారులకు అనేక హామీలిచ్చింది. ప్రతి నియోజకవర్గంలో చేపల మార్కెట్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ విషయం మేనిఫెస్టోలోనూ పెట్టింది. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచినా ఇంతవరకు అతీగతీ లేదు. వారికి మత్స్యకారుల ఓట్లు కావాలి. సంక్షేమం మాత్రం పట్టదు. ఈ సారి ఓట్లు అడగడానికి వచ్చే టీడీపీ నేతల ముఖాలను పగులకొట్టండి’ అని జాతీయ మత్స్యకారుల సంఘం రాయలసీమ ఇన్‌చార్జ్‌ పీజీ వెంకటేష్‌ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ అన్ని కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారని, కానీ మత్స్యకారులకు గతంలో ఉన్న కార్పొరేషన్‌ను మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల వంటి చిల్లర తమకొద్దని, శాశ్వత అభివృద్ధి కావాలని స్పష్టం చేశారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేలా పార్లమెంటుకు పంపుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు  అధ్యయన కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సంప్రదాయ మత్స్యకారులను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని, కావున అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుండటంతో అధికారులు ఆయన ప్రసంగాన్ని అర్ధంతరంగా బంద్‌ చేయించారు.

మంత్రి వస్తే ఒకాయన టిఫిన్‌కు.. మరొకాయన భోజనానికి తీసుకెళతారు
సొంత పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మత్స్యశాఖ మంత్రి జిల్లాకొస్తే ఒకాయన టిఫిన్‌కు, మరొకాయన భోజనానికి ఇళ్లకు పిలుచుకెళతారని, మత్స్యకారుల సమస్యలను తెలుసుకునేందుకు అవకాశమే ఇవ్వరని అన్నారు. ‘కులవృత్తులు మాయమవుతున్నా మీరు.. మేమే విడువడం లేదని ఇది వరకు ఒకాయన అన్నారు. ఆయనది కూర్చొని సంపాదించే వృత్తి. మీది ప్రమాదకరమైన వృత్తి’ అని అన్నారు. కర్నూలు చేపల మార్కెట్‌ను దేశానికే మోడల్‌గా  అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎంపీ టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ మత్స్యకారులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు.

కర్నూలు వరదలప్పుడు మత్స్యకారులు త్యాగం చేయకపోయి ఉంటే మృతుల సంఖ్య భారీగా ఉండేదన్నారు. నేటికీ మత్స్యకారులు, తమ సామాజిక వర్గీయులు మాత్రమే కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి మాట్లాడుతూ నగర పాలక çకమిషనర్‌తో చర్చించి మోడల్‌ చేపల మార్కెట్‌కు అవసరమైన స్థలాన్ని గుర్తిస్తామన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు రూ.53.24 లక్షల విలువైన పుట్టిలు, మోపెడ్‌లు, ఐస్‌ బాక్స్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలోకేడీసీసీబీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్, జిల్లా మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ షేక్‌లాల్‌ మహమ్మద్, జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బెస్త శ్రీనివాసులు, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు బి.శ్రీనివాసులు, గోరుకల్‌ సుబ్బరాయుడు, రాజు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు