విలీనంపై తాపీగా ఫిర్యాదు!

22 Jun, 2019 04:32 IST|Sakshi
ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ ఎంపీలు గల్లా, రామ్మోహన్‌నాయుడు, కేశినేని, సీతారామలక్ష్మీ

పార్టీ వీడిన నలుగురు ఎంపీలను బీజేపీ సభ్యులుగా గుర్తించే వరకు నిరీక్షించిన టీడీపీ 

ఆ తరువాత ఉపరాష్ట్రపతిని కలసి నింపాదిగా ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే బీజేపీలోకి పంపారంటూ జరుగుతున్న ప్రచారానికి తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్‌రావులు టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన 24 గంటల తరువాత తాపీగా వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఉపరాష్ట్రపతి, రాజ్యసభా చైర్మన్‌ వెంకయ్యనాయుడుకి టీడీపీ ఫిర్యాదు చేయడం గమనార్హం.

టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలంటూ నలుగురు ఎంపీలు తీర్మానం చేసి రాజ్యసభ చైర్మన్‌కు గురువారమే లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షం విలీనాన్ని సమ్మతిస్తూ రాజ్యసభా బులెటిన్‌ విడుదల చేసింది. విలీనం చేసిన ఎంపీలను బీజేపీ సభ్యులుగా గుర్తిస్తూ వెబ్‌సైట్‌లో మార్పులు కూడా చేసింది. ఈ ప్రక్రియ అంతా పూర్తయి పార్టీ మారిన ఎంపీలను బీజేపీ సభ్యులుగా గుర్తించే వరకు వేచి చూసిన టీడీపీ శుక్రవారం సాయంత్రం ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం గమనార్హం. 

ఈసీ గుర్తించాల్సి ఉంటుంది: టీడీపీ ఎంపీలు
టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, తోట సీతారామలక్ష్మీ రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యను ఆయన నివాసంలో కలిశారు. టీడీపీ రాజ్యసభాపక్ష సమావేశం ఏదీ జరగలేదని, పార్టీని విలీనం చేస్తున్నట్టు నలుగురు సభ్యులు చేసిన తీర్మానం చెల్లదని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు చేశారు. ఒకపార్టీ ఇంకో పార్టీలో విలీనం కావటాన్ని ఎన్నికల సంఘం గుర్తించాల్సి ఉంటుందని, అది రాజ్యసభా పరిధిలో ఉండదని సమావేశం అనంతరం టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. విలీనాన్ని సమ్మతిస్తూ రాజ్యసభ బులెటిన్‌ విడుదల చేసే వరకు టీడీపీ ఫిర్యాదు చేయకపోవడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ఆదేశాలతోనే ఎంపీలు రాజ్యసభా పక్షాన్ని విలీనం చేశారన్న వాదనకు ఇది బలం చేకూరుస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు