నామినేషన్ల మహాకుట్ర బట్టబయలు..

27 Mar, 2019 20:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపును అడ్డుకునేందుకు టీడీపీ పాల్పడుతున్న కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు ఇప్పటికే డేటా చోరీకి పాల్పడ్డ టీడీపీ అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. తాజాగా నామినేషన్ల పేరిట టీడీపీ పాల్పడ్డ మహాకుట్ర బట్టబయలైంది. డబ్బును ఎరగా చూపి ప్రజాశాంతి  పార్టీ బీ ఫామ్‌లు కొనుగోలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని టీడీపీ నేతలు భావించారు. అందుకోసం ప్రజాశాంతి పేరిట తమకు అనుకూలంగా ఉండే డమ్మీ అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించారు.

ఏపీలో జరుగుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల పేర్లను, ఇంటి పేర్లను పోలి ఉన్న వారు పదుల సంఖ్యలో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి చేత టీడీపీ నాయకులే నామినేషన్లు దాఖలు చేయించారనడానికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిని సంస్థాగతంగా ఎదుర్కొలేక పోతున్న టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ ఆయన్ని గెలవకుండా చేయడానికి చేసిన కుట్రకు ఆధారాలు లభించాయి. ప్రజాశాంతి తరఫున బీ పామ్‌ కొనుగోలు చేసి దానిని కె విశ్వనాథ్‌ అనే వ్యక్తి చేతికి అందజేశారు. ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గడువుకు ఒక్క రోజు ముందు పయ్యావుల అనుచరుడు పరమేశ్వరరెడ్డి జరిపిన ఫోన్‌ సంభాషణ వెలుగు చూసింది. విశ్వేశ్వరరెడ్డిని పేరును పోలిన కె విశ్వనాథరెడ్డి అనే వ్యక్తితో పరమేశ్వరరెడ్డి బేరాసారాలకు దిగారు. 

ఈ ఆడియో టేపుల్లో పరమేశ్వర రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్‌ అని, వైఎస్సార్‌ సీపీ గుర్తు ఫ్యాన్‌ అని గుర్తులతో పాటు, అభ్యర్థుల పేర్లు కూడా ఒకే మాదిరిగా ఉంటే ఓటర్లు  కన్ఫ్యూజ్‌ అయ్యే అవకాశం ఉందని ఆయన కె విశ్వానాథరెడ్డికి వివరించారు. కేఏ పాల్‌ నుంచి బీ ఫామ్‌ డబ్బులకు ఎలా కొనుగోలు చేస్తున్నది కూడా చెప్పారు. పేర్ల పేరిట, గుర్తు పేరిట వైఎస్సార్‌ సీపీ ఓటర్లను చీల్చడానికి పనిన్న కుట్రను స్పష్టంగా పేర్కొన్నారు. నామినేషన్‌ వేసిన తర్వాత విత్‌డ్రా చేయకూడదని కూడా పేర్కొన్నారు. అంతేకాకుండా పయ్యావుల ఎదో రకంగా సాయం చేస్తారని ఆశచూపారు. లేదంటే తోక్కెస్తారు అని హెచ్చరించారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కుట్రలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల పోలిన పేర్లతో ప్రజాశాంతి తరఫున నామినేషన్‌ దాఖలు కావడంపై స్పందించిన కేఏ పాల్‌ ఏమో కుట్ర జరిగిందేమోనని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సాక్షి ప్రతినిధి దీనిపై ప్రశ్నించగా ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. తన పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థుల పేర్లు కూడా కేఏ పాల్‌కు తెలువకపోవడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. 

అయితే ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్‌, తమ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండటం వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఇదివరకే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తును పోలిన ట్రక్‌కు గుర్తుకు భారీగా ఓట్లు పోలైన సంగతి తెలిసిందే. అయితే ఓటర్లను తికమక పెట్టి ఇతర పార్టీల గెలుపును అడ్డుకోవడానికి కుట్రలు పన్నడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు