చతికిలబడ్డ ప్రతిపక్షం

11 Dec, 2019 04:26 IST|Sakshi

ఉల్లిపై శవరాజకీయం బట్టబయలు

హెరిటేజ్‌పై బెడిసికొట్టిన సవాల్‌.. రైతు భరోసా పైనా అక్కరకురాని లెక్కలు

దిక్కుతోచని స్థితిలో సభ నుంచి నిష్క్రమించిన చంద్రబాబు అండ్‌ కో

ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం మా కుటుంబానికి లేదు. సాంబిరెడ్డి గుడికి వెళ్లొస్తూ మార్కెట్‌ నుంచి కూరగాయలు తీసుకొస్తుంటారు. సోమవారం ఆయన మార్కెట్‌కు వెళ్లినప్పుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. టీడీపీ వాళ్లు దీన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం దుర్మార్గం. 
– సాంబిరెడ్డి కుటుంబీకులు

సాక్షి, అమరావతి: ఉల్లిపై చర్చ తలబొప్పి కట్టించేలా చేసింది. హెరిటేజ్‌పై చేసిన సవాల్‌ ఇరుకున పడేసింది. రైతు భరోసాపై చెప్పిన లెక్కలన్నీ తప్పి తిప్పలుపెట్టాయి... వెరసి మంగళవారం అసెంబ్లీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. చివరకు సభ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఉల్లి ధరలపై చర్చించాల్సిందేనని డిమాండ్‌ చేసిన చంద్రబాబు, ఆయన సహచరులకు ఊహించని షాక్‌ తగిలింది. ఉల్లిపాయలకోసం రైతుబజార్‌ క్యూలో నిలబడి చనిపోయాడని చంద్రబాబు వ్యాఖ్యానించగా అది పూర్తిగా అవాస్తవమని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వీడియో సాక్ష్యంతో రుజువు చేశారు.

హెరిటేజ్‌ ఫ్రెష్‌ నాది కాదు ఫ్యూచర్‌ గ్రూప్‌కు అమ్మేశామని, తనదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్‌ చేశారు. అయితే ఆధార సహితంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రుజువుచేయడంతో ఇరుకునపడ్డారు. కేంద్ర పథకానికి జతచేసి రైతుభరోసా ఇస్తున్నారంటూ అధికారపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టడానికి ప్రయత్నించిన చంద్రబాబు చివరకు తానే ఇరుక్కున్నారు. తన హయాంలో రుణమాఫీ పేరుతో దగాచేశారని, కేంద్రపథకాలన్నిటినీ చంద్రన్న పేరు తగిలించి ప్రచారం చేసుకున్నారంటూ మంత్రులు, అధికారపక్ష సభ్యులు ధ్వజమెత్తడంతో ప్రతిపక్షం వద్ద సమాధానమేలేకపోయింది.

శవం దొరికింది కదా అని రెచ్చిపోతారా..?
శాసనసభలో మంగళవారం టీ విరామం అనంతరం మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఉల్లిపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించగా.. అనంతరం కొలుసు పార్ధసారథి మాట్లాడారు. ఆ తర్వాత వ్యవసాయ మంత్రి కన్నబాబు మాట్లాడుతుండగా.. చంద్రబాబు జోక్యం చేసుకుంటూ గుడివాడలో ఓ వ్యక్తి రైతుబజార్‌ వద్ద ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి చనిపోయాడని అన్నారు. ఈ దశలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని జోక్యం చేసుకుని ‘శవాల మీద రాజకీయం చేసిందెవరు. గుడివాడలో సాంబిరెడ్డి అనే వ్యక్తి గుండెపోటుతో మరణిస్తే ఆయన శవం బొమ్మలతో సభకొచ్చి గందరగోళం సృష్టించింది తమరు కాదా?. సాంబిరెడ్డి ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులతో చెప్పించాలని ప్రయత్నించారు. అలా చెబితే తెల్లారేసరికి చంద్రబాబు గుడివాడ వస్తారని.. రూ.25 లక్షల నష్టపరిహారం వచ్చేలా చూస్తారని చెప్పిన మాట నిజమా? కాదా?. ఎంత వత్తిడి చేసినా సాంబిరెడ్డి కుటుంబీకులు మాత్రం తమ ఇంటికి రావొద్దని తెగేసి చెప్పి నిజాయితీని చాటుకున్నారు.

ఈ రాష్ట్రం నీ జాగీరు కాదు. గుడివాడలో ఉన్నది కొడాలి నాని అని గుర్తు పెట్టుకో’ అంటూ చంద్రబాబును దులిపేశారు. అనంతరం సాంబిరెడ్డి కుమారుడు, బావమరిది చెప్పిన మాటలున్న వీడియోను సభలో ప్రదర్శించారు. అందులో ‘ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడాల్సిన ఖర్మ తమ కుటుంబానికి లేదని, సాంబిరెడ్డి గుడికి వెళ్లొస్తూ మార్కెట్‌ నుంచి కూరగాయలు తీసుకొస్తుంటారని, అదే క్రమంలో సోమవారం ఆయన మార్కెట్‌కు వెళ్లినప్పుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించారని’ సాంబిరెడ్డి కుటుంబీకులు వివరించారు. ఎక్స్‌గ్రేషియో కోసం పాకులాడాల్సిన దుస్థితిలో తమ కుటుంబం లేదన్నారు. టీడీపీ వాళ్లు తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగాలని చూడడం, చావును రాజకీయం చేయాలని చూడటం దుర్మార్గమని ఆ వీడియోలో వివరించారు. పిచ్చిరాతలు రాసే వారిపై అవసరమైతే పరువు నష్టం దావా వేస్తామని కూడా స్పష్టం చేశారు. దీంతో కంగుతిన్న ప్రతిపక్షానికి నోట మాట లేకుండాపోయింది. 

హెరిటేజ్‌లో రూ.200కి అమ్మడం నిజం కాదా..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ సంస్థలో కిలో ఉల్లిని రూ.200కు అమ్ముతున్నారనడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు ‘హెరిటేజ్‌ ఫ్రెష్‌ నాది కాదు. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు అమ్మేశాం. అది నాదని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. లేకుంటే మీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు. ఏదిపడితే అది మాట్లాడటానికి వీల్లేదు’ అంటూ శివాలెత్తారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జోక్యం చేసుకుంటూ ఫ్యూచర్‌ గ్రూప్‌లో చంద్రబాబుకు 3.65 శాతం షేర్లు ఉన్నట్లు బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రికలో వచ్చిన కథనాన్ని సభ ముందుంచి బాబును ఆత్మరక్షణలో పడేశారు. షేర్లు ఉన్నాయో లేవో చెప్పాలని నిలదీశారు. దీంతో ఉక్కిరిబిక్కిరైన చంద్రబాబు తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.

రైతుభరోసాపైనా ఇరకాటమే..
రైతు భరోసాపై చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 మాత్రమే ఇచ్చి జగన్‌ మోసం చేశారని వ్యాఖ్యానించారు. నాలుగు, ఐదు విడతల్లో చెల్లించాల్సిన రైతు రుణమాఫీపై అవసరమైతే కోర్టుకు వెళతామన్నారు. దీనిపై  మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, కొడాలి నాని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పీఎం యోజన ప్రకటించడానికి ముందే జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. బేషరతుగా రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు చివరకు దానిని చంద్రన్న దగాపథకంగా మార్చారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలను సభలో ప్రదర్శించారు. కేంద్ర పథకాలకు చంద్రన్న బాట, చంద్రన్న బీమా వంటి పేర్లు పెట్టుకున్నారని, నీరు–చెట్టు పథకంతో టీడీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దీంతో చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏమీ మాట్లాడలేకపోయారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు