టీడీపీలో మహిళలకు న్యాయం జరగదా?

26 May, 2018 03:32 IST|Sakshi
వేదికపై నుంచి పక్కకు లాక్కెళుతున్న టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగిన నర్రా లలిత

     మంత్రులను నిలదీసిన మహిళా కార్యకర్త

     నా భర్త చావుకు కారకులను పార్టీ నేతలే రక్షిస్తున్నారు.. మంత్రి ప్రత్తిపాటి రాజీ పడమంటున్నారు

     సీఎంను కలిసినా న్యాయం జరగలేదు

     గుంటూరు మినీ మహానాడులో కలకలం

సాక్షి, గుంటూరు: మహిళలకు అన్యాయం జరిగితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నా స్వయంగా టీడీపీ నేతలే తనపై దాడులకు పాల్పడుతున్నారని పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం గుంటూరులో మినీ మహానాడు సందర్భంగా వేదికపైకి చేరుకున్న ఆమె తనకు న్యాయం చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీశారు. టీడీపీ మహిళా కార్యకర్తనైన తనపైనే అరాచకాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని నిలదీయటంతో వారంతా కంగుతిన్నారు.

వెళ్లిపోవాలన్న మంత్రి ప్రత్తిపాటి
‘టీడీపీలో మహిళలకు న్యాయం జరగదా? నా భర్త మృతికి కారణమైన వారిని టీడీపీ నేతలే రక్షిస్తున్నారు. నాపై దాడులకు పాల్పడుతున్నారు. రక్షణ కోరినా పట్టించుకున్న నాథుడే లేరు. ముఖ్యమంత్రిని కలిస్తే మంత్రిని కలవమన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలిసి న్యాయం చేయమని కోరితే రాజీపడమంటూ సలహా ఇస్తున్నారు’ అని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన నర్రా లలిత వాపోయింది. అయితే తాము ఏమీ చేయలేమని, వెళ్లిపోవాలంటూ మంత్రి పుల్లారావు ఆమెకు సూచించారు. అనంతరం కొందరు టీడీపీ నేతలు ఆమెను బలవంతంగా పక్కకు లాక్కెళ్లారు. ఈ గొడవను చిత్రీకరిస్తున్న విలేకరులు, మీడియాపై దురుసుగా ప్రవర్తించి కెమెరాలు లాక్కునే ప్రయత్నం చేశారు. 

చంపేస్తామని బెదిరిస్తున్నారు..
అనంతరం నర్రా లలిత విలేకరుల వద్ద తన గోడు వెల్లబోసుకుంది. తన భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని, అయితే తన చావుకు కారకులంటూ కొందరి పేర్లు వెల్లడించారని తెలిపింది. దీనిపై పలుసార్లు జిల్లా ఉన్నతాధికారులను కలవగా విచారణకు అధికారిని నియమించినట్లు పేర్కొంది. దీంతో రౌడీషీటర్‌ మొవ్వా బుల్లయ్యతోపాటు మరికొందరు కేసులు వెనక్కు తీసుకుని రాజీపడకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయింది. మాజీ ఎంపీపీ పూనాటి రమేష్, మరికొందరు టీడీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తూ విచారణ అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొంది.

మహానాడులోనే ఆత్మహత్య చేసుకుంటా
తనకు జరిగిన అన్యాయంపై గతంలోనే సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని, పోలీసు అధికారుల హామీతో కిందకు దిగి వచ్చానని లలిత తెలిపింది. టీడీపీ మహానాడు ముగిసేలోగా తనకు న్యాయం చేయకుంటే అదే ప్రాంగణంలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ కన్నీటి పర్యంతమైంది. శుక్రవారం రాత్రి లలితను గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి పిలిచి టీడీపీ నాయకులు పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు