దాచేస్తే దాగని బంధం!

22 Mar, 2019 01:36 IST|Sakshi

విశాఖ పవన్‌ నామినేషన్‌ ర్యాలీలో టీడీపీ జెండాలు

బయటపడిన జనసేన, తెలుగుదేశం బంధం

అనంతరం ప్రసంగంలోనూ చంద్రబాబు ఊసెత్తని జనసేనాని

ప్రతిపక్ష నేత జగన్‌పైనే విమర్శలు ఎక్కుపెట్టిన వైనం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/గాజువాక: పెకి ఎన్ని మాటలు చెప్పినా.. ఎంత బొంకినా.. దాచేస్తే దాగని బంధం టీడీపీ, జనసేన పార్టీలదనే విషయం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ ఘట్టం సాక్షిగా బహిర్గతమైంది. విశాఖ జిల్లా గాజువాక జనసేన అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ జీవీఎంసీ జోనల్‌ కార్యాలయానికి గురువారం ఉదయం 11.45 గంటల సమయంలో అట్టహాసంగా ర్యాలీగా తరలివచ్చారు. తమ అభిమాన నటుడు అయిన పవన్‌ నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన అభిమానులు జనసేన జెండాలతో సందడి చేయడం షరామామూలే అయినా ర్యాలీలో తెలుగుదేశం పార్టీ జెండాలు లెక్కకు మించి కనిపించడం విశేషం. జనసేన, టీడీపీ మధ్య ఉన్న రహస్య బంధాన్ని ఇది బహిర్గతం చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా ఎన్నికల్లో అడ్డదారిలో ప్రయోజనం పొందాలని ఎత్తుగడ వేసిన చంద్రబాబు అందుకోసం జనసేనతో లోపాయికారీ పొత్తు పెట్టుకుని అంచెలంచెలుగా అమలు చేస్తుండడం తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పథకం ప్రకారమే జనసేన పొత్తుల వ్యవహారం సాగుతుండడంతోపాటు సీట్ల కేటాయింపు వ్యవహారంలోనూ రెండు పార్టీల మధ్య లోపాయికారీ అవగాహన నడవడం ఇప్పటికే తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీల మధ్య బంధాన్ని పవన్‌ నామినేషన్‌ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొనడం బట్టబయలు చేసింది. అయితే టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నామినేషన్‌ ర్యాలీకి వచ్చిన శ్రేణులే పవన్‌ ర్యాలీలో కలిసిపోయారంటూ ‘కవర్‌’ చేయడానికి ప్రయత్నించడం గమనార్హం. నిజానికి నామినేషన్‌ వేసేందుకు పల్లాకు అధికారులిచ్చిన సమయం ఉదయం 10.30 గంటలు. కణితి రోడ్డు మీదుగా గాజువాక జోనల్‌ కమిషనర్‌ కార్యాలయానికి రావాలని అధికారులు స్పష్టం చేశారు. ఇక పవన్‌కు 11.30 గంటలకు సమయమిచ్చి.. నేషనల్‌ హైవే మీదుగా జోనల్‌ కమిషనర్‌ కార్యాలయానికి రావాలని సూచించారు. కానీ పవన్‌ రాకకోసం వేచిచూస్తూ.. జాప్యం చేస్తూ టీడీపీ శ్రేణులు సరిగ్గా పవన్‌ రాగానే ర్యాలీలో కలిసిపోయి.. టీడీపీ, జనసేన బంధాన్ని చాటిచెప్పాయి. పల్లా శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం 2009లో పీఆర్పీతోనే మొదలైంది. ఆ ఎన్నికల్లో పల్లా విశాఖ లోక్‌సభ స్థానానికి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో పల్లా తరఫున పవన్‌ ప్రచారాన్ని కూడా చేశారు. 

జగన్‌ లక్ష్యంగా విమర్శలు..  చంద్రబాబు ఊసే లేదు.. 
నామినేషన్‌ దాఖలు అనంతరం పవన్‌ గాజువాక బహిరంగసభలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అదే సమయంలో సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌బాబుపై పల్లెత్తుమాట అనలేదు. జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు దర్యాప్తు చేసినందుకే జేడీ లక్ష్మీనారాయణను విశాఖ ఎంపీ అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కబ్జాలు పెరిగిపోతాయని, రౌడీలు పెరిగిపోతారంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం జగన్‌మోహన్‌రెడ్డి పోరాడటం లేదని, ఆయన హోదా మాటెత్తితే ప్రతిపక్ష నేత కేసులకు సంబంధించిన ఫైలును ప్రధానమంత్రి మోదీ బయటకు తీస్తున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబు కేసుల ఊసే పవన్‌ ఎత్తలేదు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొరికిపోయిన విషయంగానీ, డేటా స్కాం విషయంపైగానీ, దళితులపై జరిగిన దాడులనుగానీ కనీసం ప్రస్తావించలేదు. పెందుర్తిలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కబ్జాలు చేశారన్నారు.ఆయన్ని ఎదుర్కోవడానికి చింతలపూడి వెంకట్రామయ్యను అభ్యర్థిగా పెట్టామన్నారు.

ప్రభుత్వంలో అవినీతి ఉన్నా మంత్రివర్గంలో ఉండి కూడా గంటా శ్రీనివాసరావు ఏమీ చేయలేకపోయారని, ఆయన ఎందుకు ఆగిపోయారో తనకు అర్థం కాలేదని, అందుకే వారిపై గట్టి అభ్యర్థులను పెట్టానని చెప్పారు. విజయనగరంలో బొత్సకు ధీటుగా తమ పార్టీ అభ్యర్థిని పెట్టానన్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు మంచివారిని అభ్యర్థులుగా పెడితే తాను కూడా మంచివారినే పెడతానని, వారు ఎటువంటి వారిని పెడితే తాను అటువంటివారిని పెడతానని అన్నారు. తనకు మిత్రపక్షాలైన వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడటానికి ఆయన అవకాశమివ్వలేదు. ఇటీవల గాజువాకలో నిర్వహించిన ఒక బహిరంగసభలో సీపీఎం, సీపీఐ నాయకులు టీడీపీ అక్రమాలను కడిగి పారేశారు. ఈ సభలో తమకు మాట్లాడే అవకాశం కల్పిస్తే టీడీపీ అక్రమాల్ని బయటపెడతామనే ఉద్దేశంతోనే పవన్‌ అవకాశమిచ్చి ఉండకపోవచ్చని వామపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.  

మరిన్ని వార్తలు