ఫలించని చంద్రబాబు వ్యూహం

8 Dec, 2018 19:46 IST|Sakshi
కూకట్‌పల్లి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే భాగ్యనగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎన్నికలు ఒక ఎత్తుగా శుక్రవారం పోలింగ్‌ సాగింది. ఏపీ సీఎం చంద్రబాబు కూకట్‌పల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో తన బంధువులను కీలకం చేయాలని ఎత్తులు వేశారు. అందులో భాగంగా తన సమీప బంధువు సుహాసిని రంగంలోకి దించి సరికొత్త రాజకీయానికి తెరలేపారు. ఎలాగైనా కూకట్‌పల్లిలో సుహాసినీని తన పాచికలతో నెగ్గించుకోవాలని చూశారు. కానీ చంద్రబాబు వ్యూహం అక్కడ ఫలించలేదు. కావల్సినంత డబ్బులు పంపినా ద్వితీయ శ్రేణి నాయకులు బస్తీవాసులకు అందజేయకుండా దిగమింగేశారని ప్రచారం సాగుతోంది.

బస్తీ నాయకులను కేవలం రోజుకు రెండు మందుబాటిళ్లతో సరిపెట్టేశారు. దీనికి తోడు ఈనెల 5వ తేదీ రాత్రి ఏపీ ఎస్పీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌రావు ఇంటి వద్ద భారీ మొత్తం నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో, బయటి నుంచి డబ్బులు, ఇతర ప్రలోభాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని చూసిన టీడీపీ ఆంధ్ర ప్రాంత నాయకులు పలాయనం చిత్తగించారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను బస్తీ టీడీపీ నాయకులు సీరియస్‌గా తీసుకోకుండా వదిలేశారని సమాచారం. దీంతో అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపు తథ్యమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు