మీ‘బండ’బడ.. ఇదేం రాజకీయం! 

31 Oct, 2019 07:55 IST|Sakshi
నాగరాజు ఇంటికి దక్షిణ వైపున్న సిమెంట్‌ రోడ్డు ,స్థలం పత్రాలు చూపుతున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు బీకేఎస్‌ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నడిపి సిద్దరామప్ప కుమారుడు నాగరాజుది. చిత్రంలో కనిపిస్తున్నట్లుగా ఇంటికి దక్షిణాన సిమెంట్‌ రోడ్డు ఉండగా.. నాగరాజు మాత్రం తూర్పువైపున్న వెంకటనారాయణరెడ్డి స్థలంలోకి గేటు పెట్టాడు. దీంతో వెంకటనారాయణరెడ్డి తన స్థలం చుట్టూ బండలు పాతుకోగా.. తన ఇంటిచుట్టూ బండలు పాతారంటూ నాగరాజు గగ్గోలు పెడుతున్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నాయకులు కూడా కొన్నిరోజులుగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేసి రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా పలువురు నాయకులు వెంకటాపురం వెళ్లేందుకు ప్రయత్నించగా శాంతిభద్రతలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసులు వారిని అడ్డుకుని స్వగృహాలకు తరలించారు. ఈ చిత్రం చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.. టీడీపీ ‘బండ’ రాజకీయం.  

ఆధారాలు చూపించి మాట్లాడండి
బుక్కరాయసముద్రం : వెంకటాపురంలో టీడీపీ నాయకుడు నాగరాజు స్థలానికి సంబంధించిన పత్రాలు చూపించి మాట్లాడాలని, స్థల యజమాని బండలు పాతితే తప్పా అంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే తన స్వగృహంలో కురుబ సంఘం నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు.  గ్రామంలో ఇద్దరి వ్యక్తుల మద్య ఉన్న స్థల వివాదానికి రాజకీయ రంగు పులిమి కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి రోడ్లపైకి ఆందోళనలు నిర్వహించడం సిగ్గు చేటన్నారు. వెంకటనారాయణరెడ్డి సొంత స్థలంలో నాగరాజు అప్పటి కాంట్రాక్టర్‌కు కొంత మొత్తం చెల్లించి సిమెంట్‌ రోడ్డు వేయించుకున్నాడన్నారు. సదరు స్థలాన్ని వెంకట నారాయణరెడ్డి పంచాయతీకి గానీ, ప్రభుత్వానికి గానీ రాసివ్వలేదన్నారు. ఎలాంటి తీర్మానాన్ని కూడా స్థలయజమాని నుంచి తీసుకోలేదని, దీంతో అతడు తన స్థలానికి హద్దుల ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా బండలు పాతడాన్నారు.

అయితే ఈస్థలం పక్కనే ఉన్న నాగరాజు ఇటీవలే  ఇల్లు నిర్మించాడన్నారు. ఆ ఇంటికి దక్షిణ వైపు సిమెంట్‌ రోడ్డు ఉందని, తూర్పు వైపు ఉన్న వెంకటనారాయణరెడ్డి స్థలంపై కూడా తమకు హక్కు ఉందంటూ బండలు తొలగించాలంటూ టీడీపీ నేతలు రాద్దాంతం చేయడం దారుణమన్నారు. ఈ వివాదంపై టీడీపీ నాయకులు రోజూ ధర్నాలు, ఆందోళనలు అంటూ గొడవలకు దారి తీసేలా ప్రయత్నిండం ఏమాత్రం సరికాదన్నారు. 10 రోజులుగా నాగరాజు సిమెంట్‌ రోడ్డుకు సంబంధించిన పత్రాలు ఏమాత్రం చూపించకుండా ఈ రోడ్డుపై తమకు హక్కు ఉందని చెప్పడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ ఆందోళనల వెనుక జేసీ హస్తం ఉందని, ఈ రోజు కూడా బీకేఎస్‌లో ఆందోళనల షో చేశారన్నారు.  

వ్యక్తిగత విమర్శలు తగదు.. 
టీడీపీ నాయకులు అనవసరంగా తనపై, తన కుటుంబంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాగే మరోసారి విమర్శలు చేస్తే వారిపై కేసులు వేస్తామని హెచ్చరించారు. వ్యక్తిగత సమస్యను కులాల సమస్యగా చిత్రీకరించడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు గత ఎన్నికలలో కోలుకోలేని దెబ్బతిన్నారని, ప్రజల్లో ఉనికి కోసం పాకులాడుతున్నారన్నారు. ఒక వర్గం మీడియా కూడా కేవలం వెంకటనారాయణరెడ్డి నాటిన బండలనే చూపించడం దారుణమన్నారు.  నాగరాజు ఇంటికి దక్షిణ వైపు ఉన్న సిమెంట్‌ రోడ్డు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.  వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ అంకే నరేష్, కురుబ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుల్లే నారాయణస్వామి, జిల్లా కార్యదర్శి బుల్లే వీర నారప్ప, సీఎం వెంకటేశు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు