టీడీపీ పాలనలో అభివృద్ధా? అబద్ధం 

11 Jul, 2019 04:15 IST|Sakshi

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపాటు   

మత్స్య సంపద పెరిగితే వ్యవసాయ వృద్ధి రేటు పెరిగినట్టా?  

తెలుగుదేశం సర్కారు ఖాళీ ఖజానా, భారీగా అప్పులనే మిగిల్చింది  

అప్పులు రూ.3.62 లక్షల కోట్లు.. ఆర్థిక లోటు రూ.66,000 కోట్లు  

సాక్షి, అమరావతి:  రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక లోటు రూ.20 వేల కోట్లు ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా రూ.66 వేల కోట్లకు చేరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆయన బుధవారం సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది వాస్తవాలను బహిర్గతం చేసే శ్వేతపత్రమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అక్షరాలా రూ.3.62 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని స్పష్టం చేశారు.

విస్తీర్ణంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో స్థానంలో ఉందని, స్థూల ఉత్పత్తి పెరుగుదల విషయంలో వెనుకబడి ఉందన్నారు. గత టీడీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందన్నారు. టీడీపీ సర్కారు తమ ప్రభుత్వానికి ఖాళీ ఖజానా, భారీగా అప్పులను అప్పగించిందన్నారు. రూ.వేల కోట్ల బకాయిల భారాన్ని కొత్త ప్రభుత్వంపై నెట్టేసిందని పేర్కొన్నారు. రూ.లక్షన్నర కోట్లకు పైగా అప్పులను తీసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ నిధులను సొంత ప్రయోజనాల కోసమే వాడుకుందని దుయ్యబట్టారు. బుగ్గన ఇంకా ఏం మాట్లాడారంటే..  

‘‘2004–09లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 12 శాతం జీడీపీ పెరుగుదలతో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధి చెందింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలన ప్రజలు అనుకున్న విధంగా జరగలేదు. టీడీపీ ప్రభుత్వం అనుబంధ రంగాలను వ్యవసాయంతో కలిపి చూపి, ప్రజలను తప్పుదోవ పట్టించింది. గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందకపోగా మైనస్‌లోకి వెళ్లిపోయింది. చేపలు, పశు సంవర్థక శాఖలోని అభివృద్ధిని వ్యవసాయానికి జోడించారు. దాంతో వ్యవసాయ రంగం ముందంజలో ఉందంటూ నమ్మబలికారు. ఇలాంటి పద్ధతి గతంలో ఎప్పుడూ లేదు. టీడీపీ హయాంలో వ్యవసాయ రంగంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందనడం పచ్చి అబద్ధం. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి తక్కువే. ఏపీలో వ్యవసాయ వృద్ధి రేటు దేశంలోనే అత్యధికమని గత టీడీపీ ప్రభుత్వం చెప్పింది. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. మత్స్య రంగం వృద్ధి చెందితే వ్యవసాయ వృద్ధి రేటు పెరిగినట్టా? జాతీయ స్థాయిలో ద్రవ్యోల్బణం బాగా తగ్గినా ఏపీలో మాత్రం పెరిగింది. పరిమితికి మించి అప్పులు చేశారు  

గత టీడీపీ ప్రభుత్వం ‘ఎఫ్‌ఆర్‌బీఎం ’ పరిమితిని దాటి అప్పులు చేసింది. తెలంగాణకు వచ్చినట్టు మనకు పన్నుల ద్వారా ఆదాయం రాలేదు. రాష్ట్ర జీడీపీలో 3 శాతానికి మించి అప్పులు చేయకూడదు. 2017–18లో పరిమితికి మించి 4.08 శాతం అప్పులు చేశారు. తలసరి ఆదాయం పరంగా చూస్తే తెలంగాణ కంటే బాగా వెనుకబడి ఉన్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు. వాళ్లు చెప్పిందల్లా, తాము ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలు అని చూడడం లేదని, తమ పరిధిలో కేటాయింపులు చేస్తున్నట్లు మాత్రమే చెప్పారు.

ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉంటే, ఆ రాష్ట్రం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం కాకపోయినా సరే  నిధులు ఇస్తామని ఆర్థిక సంఘం చెప్పింది. ప్రత్యేక హోదా విషయంలో చట్టపరమైన హక్కును టీడీపీ తుంగలో తొక్కింది. చట్టంలో ఉన్నది కూడా తీసుకురాకుండా నీరుగార్చింది. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తామే కట్టుకుంటామని టీడీపీ సర్కారు తీసుకుంది. దుగరాజపట్నం పోర్ట్‌ను కచ్చితంగా కేంద్రమే కట్టాలి, కానీ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాకుండా 2018–19లో విద్యుత్‌ సంస్థలకు(డిస్కమ్స్‌) రూ.8 వేల కోట్లు రావాల్సి ఉండగా, రూ.2500 కోట్లు మాత్రమే కేటాయించి, ఇందులో రూ.1,200 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది.

కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకే టీడీపీ సర్కారు ప్రాధాన్యం  
గత ప్రభుత్వం 6 నెలలుగా అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, హోంగార్డులు, ఔట్‌సోర్సింగ్‌ తదితర ఉద్యోగుల జీతాలు, పలు శాఖల్లో చెల్లించాల్సిన నిధులు చెల్లించకుండా పెండింగ్‌లోనే ఉంచింది. కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మేము విద్య, ఉద్యోగ అవకాశాల పెంపుదలతో పాటు ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి సారిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేందుకు కృషి చేస్తాం. విద్యారంగంపై ఖర్చు చేసిన అప్పును పెట్టుబడిగా భావించాలి. ఏదైనా చెల్లింపు జరగాలంటే ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్‌ల ద్వారా నిర్వహించాలి. అలా చేయకుండా గత ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్లుగా బిల్లులు చెల్లించేశారు. ఆదాయం మైనస్‌లో ఉన్నప్పటికీ మా ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి ఎక్కువగా నిధులు ఖర్చు చేస్తోంది.

విత్తనం వేయక ముందే రైతుకు సాయం  
రైతు విత్తనం వేయకముందే సాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. రైతులకు ఇన్సూరెన్స్‌ కల్పించే గొప్ప కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొదటిసారిగా అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టిన ఘనత కూడా వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ  ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తాం’’.    

ప్రత్యేక హోదాను నీరుగార్చారు 
విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం ఆ అంశాన్ని నీరుగార్చింది. ప్రత్యేక ప్యాకేజీ వినూత్నమైనదంటూ సంతోషంగా తీసుకుంది. ఆ ప్యాకేజీలో ఉన్నదంతా పునర్విభజన చట్టంలోని హామీలే. చట్టపరంగా మనకు వచ్చే హక్కులనే రీ ప్యాకేజ్‌ చేసి పేపర్‌లో పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్యాకేజీ సాధించలేకపోయారు. తొలి ఏడాదే లోటు బడ్జెట్‌ నిధులను కేంద్రం నుంచి తేలేకపోయారు. ఘోరమైన పరిస్థితుల్లో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని మాకు అప్పగించింది. ప్యాకేజీ వద్దు... హోదానే కావాలని అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో డిమాండ్‌ చేస్తే టీడీపీ నేతలు వెటకారంగా మాట్లాడారు. ప్యాకేజీ గురించి మీకు తెలియదు, తెలియకపోతే ట్యూషన్‌ పెట్టించుకో అన్నారు. తీరా ఎన్నికల సమయంలో చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్ష అంటూ డ్రామాలాడారు. 

మరిన్ని వార్తలు