లక్ష కోట్లు లూటీ!

9 Nov, 2018 04:02 IST|Sakshi

నాలుగేళ్లలో రూ.1,53,435 కోట్లు అప్పు చేసిన టీడీపీ సర్కారు

ఆస్తులు సమకూరే ఉత్పాదక రంగంపై మూడో వంతే ఖర్చు

ఇందులోనూ నీరు చెట్టు, సాగునీటి పనుల అంచనాలు పెంపు లాంటి కమీషన్ల దందానే

విలాసాలు, దుబారాలకు చేసిన వ్యయం రూ.1.04 లక్షల కోట్లు

తాత్కాలిక కట్టడాలు, సీఎం కార్యాలయాలకు మరమ్మతులు, ఈవెంట్ల పేరుతో నిధుల దుర్వినియోగం

ఇవికాకుండా బడ్జెట్‌ బయట కార్పొరేషన్ల పేరుతో మరో రూ.71 వేల కోట్లకుపైగా రుణానికి సర్కారు సిద్ధం 

కేంద్రం నుంచి పన్నుల్లో రాష్ట్ర వాటా,ప్రాయోజిత పథకాలు, రెవెన్యూ లోటు రూపంలో ఏపీకి రూ.1,72 లక్షల కోట్లకుపైగా నిధులు

భవిష్యత్‌లో అప్పులు పుట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం రుణాల ఊబిలోకి గెంటేస్తోందని ఆర్థిక రంగ నిపుణుల ఆందోళన

అప్పు తీర్చేందుకు మరో అప్పు...కమీషన్లు కాజేసేందుకూ అప్పు..ఖజానాకు కన్నం వేసేందుకూ అప్పే..రాష్ట్ర సర్కారు సొంత ఖజానాకే చిల్లులు పొడుస్తూ జనం చేతిలో చిప్ప పెడుతోంది..!నాలుగున్నరేళ్ల పాలనలో రూ.లక్షన్నర కోట్లకుపైగా అప్పులు చేసిన టీడీపీ సర్కారు ఆస్తుల కల్పనకు వెచ్చించిన సొమ్ము కేవలం రూ.49,367 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం రూ.1.04 లక్షల కోట్లకుపైగా అనుత్పాదక రంగాలకు దుబారాగా ఖర్చు చేసినట్లు స్వయంగా కాగ్‌ నివేదికే వెల్లడిస్తోంది. ఇక ఆస్తుల కల్పన కింద వెచ్చించిన కొద్ది మొత్తంలోనూ నీరు–చెట్టు, సాగునీటి ప్రాజెక్టుల పనుల అంచనాల పెంపు లాంటి కమీషన్ల వ్యవహారాలే ఉన్నాయని, మొత్తంమీద రూ.లక్ష కోట్లకుపైగా దుబారా వ్యయం జరిగిందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

సాక్షి, అమరావతి: రెండంకెల వృద్ధి దేవుడెరుగు అప్పులు చేయడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ప్రథమ స్థానంతో దూసుకెళుతోంది. చేసిన అప్పులను టీడీపీ సర్కారు జల్సాలు, కమీషన్ల ద్వారా జేబులు నింపుకోవడానికి వాడుకోవడంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం నాలుగేళ్లలో భారీగా పెరిగిపోయింది. సాధారణంగా ప్రభుత్వమైనా, వ్యక్తులైనా ఇళ్లు, పొలం లేదంటే వాహనం కొనేందుకు అప్పు చేస్తారు. తీసుకున్న సొమ్మును సక్రమంగా వినియోగించుకుని ముందుచూపుతో ఆస్తులను సమకూర్చుకుంటారు. అయితే టీడీపీ సర్కారు ఇందుకు పూర్తి విరుద్ధంగా అప్పులు చేసి కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్‌ పేరుతో భారీగా డబ్బులు చెల్లిస్తూ కమీషన్లు రాబట్టుకునేందుకు అలవాటు పడిపోయింది. అప్పులు చేయడంలో తప్పు లేకున్నా దీన్ని అనుత్పాదక రంగాలకు వ్యయం చేయడాన్నే అధికార యంత్రాంగం తప్పుబడుతోంది. 

నీరు–చెట్టు.... సగం జిల్లాలు కరువులోనే
నీరు–చెట్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో ఏకంగా రూ.15,386 కోట్లను వ్యయం చేసింది. ఈ పేరుతో పనులన్నీ నామినేషన్‌పై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలకు కట్టబెట్టేశారు. ఈ కార్యక్రమానికి ఇంత భారీగా వ్యయం చేసినా రాష్ట్రంలో సగం జిల్లాలు కరువు కాటకాలతో అల్లాడుతున్నాయి. వేల కోట్ల రూపాయలు వెచ్చించిన నీరు–చెట్టు ద్వారా ఎలాంటి ఆస్తి కల్పన జరగకపోగా రైతులకు ప్రయోజనం చేకూరలేదని స్పష్టమవుతోంది. తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కానరాకపోవడంతో దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకోవాలనే రీతిలో చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

రుణఊబిలో కార్పొరేషన్లు 
ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యే తదుపరి ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు లేకుండా చేసేలా టీడీపీ సర్కారు అప్పులు చేస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌ పరిమితికి మించి అప్పులు చేసిన సర్కారు ఇప్పుడు మరీ దారుణంగా వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్‌ బయట ఏకంగా రూ.71,815 వేల కోట్ల రూపాయలు అప్పు చేయడమే దీనికి ఉదాహరణ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. బడ్జెట్‌ బయట కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేయడానికి సర్కారు గ్యారెంటీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ గత ఆర్థిక సంవత్సరంలో సొంత ఆదాయంలో 90 శాతం వరకు అప్పులకు గ్యారెంటీ ఇవ్వవచ్చు, అయితే ఇప్పుడు ఆ పరిమితి కూడా పూర్తి అయ్యేలా బడ్జెట్‌ బయట అప్పులకూ గ్యారెంటీ ఇచ్చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీ పరిమితి కూడా మించిపోవడంతో ఇటీవల మున్సిపల్‌ ఆస్తులు తాకట్టు పెట్టి బడ్జెట్‌ బయట వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.11,340 కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీ పరిమితి మించిపోవడంతో రూ.3,000 కోట్ల అప్పునకే గ్యారెంటీ ఇస్తూ మిగతా మొత్తానికి తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో గ్యారెంటీ ఇస్తామని జీవోలో స్పష్టం చేసిందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు సర్కారు ఎంత దారుణంగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇందులో వాణిజ్య బ్యాంకులు, బాండ్లు ద్వారా రూ.14,275 కోట్ల అప్పు చేసేందుకు సీఆర్‌డీఏకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అలాగే సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి రూ.30 వేల కోట్ల అప్పు చేయాలని నిర్ణయించిన సర్కారు ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 

నాలుగేళ్లలో రూ.లక్షన్నర కోట్లకుపైగా అప్పు
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక మేరకు రాష్ట్ర విభజన నాటికి (2014 జూన్‌ 2వ తేదీ) వరకు 13 జిల్లాలతో కలిపి రాష్ట్ర అప్పు కేవలం రూ.96 వేల కోట్ల రూపాయలు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఏపీ అప్పులు రూ.2,49,435 కోట్లకు పెరిగిపోయాయి. అంటే గత నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.1,53,435 లక్షల కోట్ల అప్పులు చేసింది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించి ఉంటే ఎవరూ తప్పుబట్టరు. అయితే ఎక్కువ శాతం అప్పులను అనుత్పాదక రంగాలకు వ్యయం చేస్తున్నారని కాగ్‌ నివేదికే స్పష్టం చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ అప్పు చేసి పప్పు కూడు అనే చందంగా తయారైందని స్పష్టం అవుతోంది. గత నాలుగేళ్లలో ఆస్తుల కల్పనకు కేవలం రూ.49,367 కోట్లు మాత్రమే వ్యయం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 15వ ఆర్థికసంఘానికి సమర్పించిన నివేదికలోనే స్పష్టం చేసింది. అంటే గత నాలుగేళ్లలో 1,53,435 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆస్తుల కల్పనకు రూ.49,367 కోట్లు మాత్రమే వ్యయం చేసినట్లు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పేర్కొన్నందున మిగతా అప్పుల మొత్తం రూ.1,04,068 కోట్లను అనుత్పాదక రంగాలకు వ్యయం చేసినట్లు స్పష్టం అవుతోంది. 

సొంత ఖజానాకే కన్నం..
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల కల్పనకు చేసిన వ్యయంలో కూడా నీరు–చెట్టు, ఎస్కలేషన్‌ తాత్కాలిక సచివాలయం, జల్సాలు, ఈవెంట్లు లాంటి  దుబారాల కోసం మొత్తం రూ.27,101 కోట్లు వ్యయం చేసింది. ఇందులో ప్రభుత్వ పెద్దలు పెద్ద మొత్తంలో భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందారని స్పష్టం అవుతోంది. ఖజానా నుంచే దోపిడీకి పాల్పడటంలో ఈ సర్కారు ఆరితేరిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. కాంట్రాక్టర్లకు జీవో 22 ప్రకారం అంచనాలను పెంచేసి ఎస్కలేషన్‌ పేరుతో ఏకంగా రూ.9,100 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. దీనివల్ల అదనంగా ఎటువంటి ఆస్తి సమకూరకపోగా ప్రభుత్వ పెద్దల జేబులు మాత్రం కమీషన్ల రూపంలో నిండాయనేది జగమెరిగిన సత్యం అని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

తాత్కాలిక కట్టడాలు.. జల్సాల కోసం దుబారా
భారీగా అప్పులు చేస్తున్న రాష్ట్ర సర్కారు కేవలం తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక పట్టిసీమ తప్ప ఎటువంటి శాశ్వత ఆస్తులను కల్పించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తాత్కాలిక సచివాలయం పేరుతో రూ.1,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక ఈవెంట్లు, పలుచోట్ల ముఖ్యమంత్రి కార్యాలయ భవనాల మరమ్మతులు, జల్సాల కోసం గత నాలుగేళ్లలో రూ.2,615 కోట్లు వ్యయం చేశారు. ఒకపక్క ప్రజల నుంచి విరాళాలను సేకరిస్తూ మరోపక్క జల్సాలకు వ్యయం చేయడాన్ని అధికార వర్గాలు తప్పుబడుతున్నాయి. నీరు–చెట్టు అంతా కమీషన్ల పర్వం అనే విషయం తెలిసినా దీనికి సంబంధించిన బిల్లులను అప్పులు చేసి మరీ చెల్లించాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరోపక్క ఐటీ పేరుతో ఎటువంటి ఆస్తులు  ఒనగూరని రంగానికి భారీగా వ్యయం చేస్తున్నారని ఆర్థిక శాఖ వర్గాలు తప్పుపడుతున్నాయి. ప్రైవేట్‌ సంస్థలు చేయాల్సిన పనులకు రాష్ట్ర ఖజానా నుంచి నిధులను వెచ్చిస్తున్నారని, ఇందులో భారీ దోపిడీ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ఖజానాను సొంత ఖజానాగా సర్కారు మార్చేసిందని, లెక్కా పత్రం లేకుండా వ్యవహరిస్తోందని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్థంగా ఉందో చెప్పాలంటే చేబదుళ్లకు కూడా వడ్డీ చెల్లించాల్సిన దుస్థితే నిదర్శనమని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. చేబదుళ్లను సకాలంలో చెల్లించని కారణంగా గత నాలుగేళ్లలో వడ్డీ కింద ఆర్బీఐకి రూ.124 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని కాగ్‌ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. 

కేంద్రం నుంచి రూ.1,72,509 కోట్లు...
కేంద్రం నుంచి గత నాలుగేళ్లలో రాష్ట్రానికి నిబంధనల మేరకు పన్నుల వాటా రూపంలో రూ.88,264 కోట్లు వచ్చాయి. ఇవేకాకుండా వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు, రెవెన్యూ లోటు, గ్రాంటు రూపంలో కేంద్రం నుంచి గత నాలుగేళ్లలో రూ.84,245 కోట్లు వచ్చినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అంటే కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో, గ్రాంటు రూపంలో నాలుగేళ్లలో రూ.1,72,509 కోట్లు అందినట్లు స్పష్టమవుతోంది. ఇక కేంద్రం గ్రాంటు రూపంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వెచ్చిస్తోంది.

పట్టణ పేదలకు సబ్సిడీపై మూడు లక్షల రూపాయల వ్యయంతో ఇంటి నిర్మాణం చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు లక్షల రూపాయలు పేదల పేరు మీద అప్పు చేయిస్తోంది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన రూ.1,500 కోట్లను శాశ్వత భవనాలకు కాకుండా తాత్కాలిక భవనాలకు వెచ్చించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకు వినియోగించడం లేదు. దీనికి అదనంగా రాష్ట్ర సొంత, పన్నేతర ఆదాయం కూడా ఉంది. ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర నిర్వహణ వ్యయం పోగా మిగతా మొత్తాన్ని ఆస్తుల కల్పనకు వెచ్చించకుండా దుబారాకు, కమీషన్లు వచ్చే రంగాలకు టీడీపీ సర్కారు వెచ్చిస్తున్నట్లు దీనిద్వారా తేటతెల్లం అవుతోంది. 

మరిన్ని వార్తలు