రహదారిపై రాజకీయం

10 Jan, 2019 04:07 IST|Sakshi

గుండ్లశింగవరం –మెట్టుపల్లె రోడ్డుకు గ్రహణం

మురుగుతున్న రూ.7.47 కోట్ల పీఎంజీఎస్‌వై నిధులు

అడ్డుపడుతున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి

వైఎస్సార్‌సీపీ ప్రాబల్య గ్రామాలు ఉండడమే కారణం

అవస్థలు పడుతున్న ప్రజలు

అవుకు: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులే ఆటంకాలు సృష్టిస్తున్నారు. ప్రతిదీ ‘ఓట్ల’ కోణంలో చూస్తుండడంతో ప్రజల సమస్యలు తీరడం లేదు. చివరకు రోడ్ల నిర్మాణంలోనూ రాజకీయం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. బనగానపల్లె నియోజకవర్గ ప్రజాప్రతినిధి తీరు వల్ల గుండ్లశింగవరం –మెట్టుపల్లె రోడ్డు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ మార్గంలోని అన్ని గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ప్రాబల్యం ఉండడంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అవుకు మండలంలోని గుండ్లశింగవరం నుంచి గడ్డమేకల పల్లె, రామవరం, కోనాపురం మెట్ట, మెట్టుపల్లె గ్రామాలను కలుపుతున్న రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా తయారైంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, రాళ్లు తేలి ప్రయాణానికి ఏమాత్రమూ అనువుగా లేదు.

వర్షమొస్తే ప్రజలకు నరకం కన్పిస్తోంది. దాదాపు 13 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని బీటీ రోడ్డుగా మార్చేందుకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం రూ.7.47 కోట్ల నిధులు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయితే కష్టాలు తీరతాయని ప్రజలు సంతోషించారు. అయితే.. రాజకీయ అడ్డంకులు ఏర్పడటంతో నిధులు మురిగిపోతున్నాయి. పై గ్రామాల్లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టుదనే కారణంతో రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ సమస్యగా చూపుతూ నియోజకవర్గ ప్రజాప్రతినిధి మోకాలడ్డారు. మెట్టుపల్లె నుంచి రామవరం వరకు ప్రభుత్వ భూమి 25.35 ఎకరాలు ఉండగా..రైతుల నుంచి 1.81 ఎకరాలు, కోనాపురం మెట్ట నుంచి రామవరం జంక్షన్‌ వరకు ప్రభుత్వ భూమి 4.05 ఉండగా..రైతుల నుంచి 0.42 ఎకరాలు, గడ్డమేకల పల్లె నుంచి రామవరం వరకు ప్రభుత్వ భూమి 2.93 ఎకరాలు ఉండగా.. రైతుల నుంచి 6.40 ఎకరాలు, గుండ్లశింగవరం నుంచి గడ్డమేకలపల్లె వరకు ప్రభుత్వ భూమి 5.56 ఎకరాలు ఉండగా.. రైతుల నుంచి 3.09 ఎకరాల భూమిని మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద రోడ్డు నిర్మాణానికి 37.89 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా..రైతుల నుంచి 11.72 ఎకరాలు మాత్రమే సేకరించాలి.

రైతులు అంగీకరించినా..
రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు రైతులు కూడా ముందుకొచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు పలుమార్లు వినతిపత్రం అందజేశారు. అయినా సదరు ప్రజాప్రతినిధి నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో అధికారులు మౌనం దాల్చారు. రాజకీయ కక్షతో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

రోడ్డు నిర్మాణంలో రాజకీయం తగదు
రాజకీయ కక్షతో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడం హేయమైన చర్య. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన ప్రజా ప్రతినిధి రాజకీయ కారణాలతో అభివృద్ధిని విస్మరించడం తగదు. తాను ఆదేశించే వరకు నిధులను హోల్డ్‌లో పెట్టమని అధికారులను ఆదేశించడం ఎంత వరకు సమంజసం?
–కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె

సర్వే అనంతరం పనులు
గుండ్లశింగవరం నుంచి మెట్టుపల్లె వరకు 13 కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.7.47 కోట్లు మంజూరయ్యాయి. భూ సేకరణ కొంత సమస్యగా ఉంది. భూ సేకరణకు సంబంధించి సర్వే అనంతరం పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం.
–రాముడు, పీఆర్‌ డీఈ, కోవెలకుంట్ల  

మరిన్ని వార్తలు