పెద్దాపురంలో బయటపడ్డ టీడీపీ గ్రూపు రాజకీయాలు

3 Mar, 2019 17:41 IST|Sakshi
టీడీపీ నేత బొడ్డు భాస్కర రామా రావు(పాత చిత్రం)

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. వచ్చే ఎన్నికలకు ప్రస్తుతం హోంమంత్రి చినరాజప్పకే మళ్లీ పెద్దాపురం సీటును చంద్రబాబు ఖరారు చేయడంతో పార్టీలో లుకలుకలు వెలుగుచూశాయి. పెద్దాపురం సీటు తనకే వస్తుందని చివరి నిమిషం వరకు ఆశపడ్డ మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు భంగపడ్డారు. దీంతో పెద్దాడలోని తన నివాసంలో బొడ్డు భాస్కర్‌, అనుచరులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ మారైనా వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచే పోటీ చేయాలని సన్నిహితులు సమావేశంలో ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.

అధిష్టానం నిర్ణయం మారుతుందో లేదో రెండు రోజులు వేచి చూసి టీడీపీకి బైబై చెప్పే యోచనలో బొడ్డు భాస్కర్‌ రామారావు ఉన్నట్లు తెలిసింది. కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత బొడ్డు మాట్లాడుతూ.. పెద్దాపురం సీటు తనకు ఇవ్వకపోతే వేరే పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. రాజమండ్రి ఎంపీగా తాను పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కూడా తేల్చిచెప్పారు.

మరిన్ని వార్తలు