టీడీపీ గుండెల్లో రెబెల్స్‌

1 Apr, 2019 08:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని రెబల్స్‌ వణికిస్తున్నారు. పార్టీకోసం పనిచేసిన తమను చంద్రబాబు మోసం చేశారని పలుచోట్ల ఆ పార్టీ నాయకులే తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. చంద్రబాబు స్వయంగా ఫోన్‌ చేసి పోటీ నుంచి తప్పుకోవాలని, పార్టీ కోసం త్యాగం చేయాలని బతిమిలాడినా ఎవరూ లెక్కచేయలేదు.

  • విజయనగరం జిల్లా గజపతినగరం సీటును సిట్టింగ్‌ ఎమ్మెల్యే అప్పలనాయుడికి ఇవ్వడంతో ఆయన సోదరుడు, టీడీపీ ముఖ్య నాయకుడు శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసి పార్టీకి రాజీనామా చేసి రెబల్‌గా నామినేషన్‌ వేశారు. తనను మోసం చేసిన టీడీపీని ఓడిస్తానని శ్రీనివాసరావు ప్రకటించారు. 
  • కృష్ణా జిల్లా అవనిగడ్డలో పార్టీ సీనియర్‌ నాయకుడు కంఠంనేని రవిశంకర్‌ టీడీపీపై తిరుగుబాటు చేసి అక్కడ పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌ను ఓడించేందుకు రెబల్‌గా బరిలో నిలిచారు. 
  • వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలులో పార్టీ నాయకురాలు విజయజ్యోతి రెబల్‌గా బరిలో నిలిచి.. టీడీపీ తనను మోసం చేసిందని, అవసరానికి వాడుకుని పక్కన పెట్టిందని వాపోతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోకుండా వేరే వారికి సీటిచ్చారని, పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించలేదు.
  • రాజధాని ప్రాంతమైన తాడికొండలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా రెబల్‌గా పోటీకి దిగిన సర్వ శ్రీనివాసరావును పోటీ నుంచి తప్పించేందుకు టీడీపీ నాయకులు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. 
  • చిత్తూరు జిల్లా మదనపల్లిలో సీనియర్‌ నేత బొమ్మనచెరువు శ్రీరాములు టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో రెబల్‌గా దిగారు. 
  • తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో సీటు ఆశించిన కేపీఆర్‌కే ఫణీశ్వరి, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో మాధవరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌ కడప జిల్లాలో రాజగోపాల్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో నిలిచారు.
  • నంద్యాల సిట్టింగ్‌ ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి నాలుగు స్థానాల్లో పోటీకి దిగారు. నంద్యాల ఎంపీ స్థానంలో ఎస్పీవై రెడ్డి, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం స్థానాల్లో ఆయన కుటుంబ సభ్యులు జనసేన తరఫున పోటీలో నిలబడ్డారు.   
మరిన్ని వార్తలు