టీడీపీ కేరాఫ్‌ అమరావతి

13 Mar, 2020 09:11 IST|Sakshi

ఇంకా ఖరారు కాని టీడీపీ జాబితా

అమరావతిలో అధినేత మదింపు చేస్తారట!

నేటి రాత్రికి విడుదలయ్యే  అవకాశం

40 వార్డులతో తొలి జాబితా ప్రకటించిన వైఎస్సార్‌సీపీ

నేడు మిగిలిన వార్డుల అభ్యర్థుల ప్రకటన 

బీ–ఫారం ఇచ్చేందుకు ఈ నెల 16 వరకు గడువు

నామినేషన్లకు నేడే చివరి రోజు

తెలుగుదేశం పార్టీ కేంద్రీకృత విధానాలను వీడటం లేదు. వైఎస్సార్‌సీపీ అధికార వికేంద్రకరణ నినాదం ఇవ్వడమే కాకుండా దాన్ని పాలనలోనూ.. పార్టీలోనూ ఆచరణలో పెట్టి దూసుకుపోతుంటే.. టీడీపీ రాజధాని అమరావతినే పట్టుకొని వేలాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రీతిలోనే.. జీవీఎంసీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అమరావతి వైపే చూస్తోంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో స్థానిక టీడీపీ నాయకులు ఆపసోపాలు పడి.. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల పేర్లతో ఎంపిక పూర్తి అయ్యిందనిపించి జాబితా సిద్ధం చేశారు.

గురువారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. ఆ జాబితాను అమరావతికి పంపమని తాఖీదులు రావడంతో అది కాస్త వాయిదా పడింది. జాబితాను అధినేత మదింపు చేసినాక.. శుక్రవారం సాయంత్రమో.. రాత్రో విడుదల చేస్తారట!.. మరోవైపు 40 మందితో ఇప్పటికే తొలిజాబితా విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ..శుక్రవారం తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.  ఇదిలా ఉంటే నామినేషన్ల ఘట్టం రెండో రోజైన గురువారం భారీసంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు కేవలం 24 నామినేషన్లే దాఖలు కాగా..  రెండో రోజు అన్ని వార్డుల్లోనూ కలిపి 308 దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

సాక్షి, విశాఖపట్నం: మహా నగర ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నా వైఎస్సార్‌సీపీ తప్ప మిగతా పార్టీ అభ్యర్థుల జాబితాలు వెల్లడికాలేదు. ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే గురువారం 40 మందితో తొలి జాబితా విడుదల చేసింది. తుది జాబితాను సైతం సిద్ధం చేసింది. టీడీపీ అభ్యర్థుల జాబితాను గురువారమే ప్రకటిస్తారని వార్తలు వచ్చినా.. జాబితా మాత్రం విడదల కాలేదు. అభ్యర్థులు దొరకని విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆ పార్టీ నేతలు.. జాబితా సిద్ధం చేసి అధినేత చంద్రబాబుకు పంపించినట్లు ఫీలర్లు ఇస్తున్నారు. శుక్రవారం రాత్రికి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి నిమిషం వరకూ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. కాగా టీడీపీ సహా వివిధ పార్టీల నుంచి వలస వస్తున్న నాయకులతో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరుగుతోంది. దానికితోడు ఇప్పటికే 40 మంది అభ్యర్థులను ప్రకటించగా వారిలో చాలామంది నామినేషన్లు కూడా దాఖలు చేసేశారు. మిగిలిన 58 వార్డులతో తుది జాబితాను శుక్రవారం ప్రకటించనున్నా.. 40 వార్డులకు అభ్యర్థులు ప్రకటించినా.. ఒకటిì æరెండు చోట్ల మినహా మిగిలిన చోట్ల ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం విశేషం.

ఇదెక్కడి లెక్క..?
అభ్యర్థుల ఎంపిక టీడీపీలో ఇంకా ఒక కొలిక్కి రాకపోయినా.. ఆ పార్టీ తరఫున 100 మంది నామినేషన్లు దాఖలు చేసేశారు. చాలా మంది పార్టీని వీడిపోవడంతో మిగిలిన వారిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులను అన్వేషించి.. ఎలాగోలా 98 వార్డులకు అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు పంపించినట్లు సమాచారం. అమరావతిలో అభ్యర్థుల జాబితా మదింపు చేసి శుక్రవారం రాత్రికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు మధ్యాహ్నం 3 గంటల వరకే గడువు ఉండగా రాత్రి జాబితా ప్రకటించి ఏం చేస్తారని టీడీపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.

అయితే నామినేషన్ల ఉపసంహరణ అంటే.. ఈ నెల 16 వరకూ బీ–ఫారం ఇచ్చేందుకు గడువు ఉండటంతో పోటీ చేయాలనుకుంటున్న వారంతా నామినేషన్లు వేసుకోవాలని స్థానిక నాయకులు సూచించినట్లు సమాచారం.  ఇదే పంథాలో బీజేపీ– జనసేన కూటమి కూడా వ్యవహరిస్తోంది. పొత్తులపై ఎడతెగని మంతనాలు చేస్తున్నప్పటికీ  సర్దుబాటు కుదరక జాబితా ఆలస్యమవుతోందని ఆ పార్టీల వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి గ్రేటర్‌ ఎన్నికల్ని అన్ని రాజకీయ పార్టీలూ చివరి నిమిషం వరకూ సస్పెన్స్‌తో కొనసాగించేలా చేస్తుండటంతో నగర ప్రజలు కూడా రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

మరిన్ని వార్తలు