ఊరించి.. చివరికి హ్యాండిచ్చి

12 Mar, 2018 03:39 IST|Sakshi

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి

అవమానకర రీతిలో తప్పించడంపై వర్ల రామయ్య మనస్తాపం

సామాజిక సమతుల్యం పాటించడంలేదని నేతల ఆందోళన

సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తీరుపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆశావహులను చివరి వరకు ఊరించి, చివరకు హ్యాండివ్వడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యక్తిగత, రాజకీయ అవసరాలే ప్రాతిపదికన సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్‌ ఎంపికపై సీనియర్లు రగిలిపోతున్నారు. అధినేత చెప్పే మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండడంలేదని  వ్యాఖ్యానిస్తున్నారు. అభ్యర్థుల ఖరారును చివరి వరకు సాగదీసి, చివరకు తమకు నచ్చిన వారికి ఇవ్వడం పార్టీ అధినాయకత్వానికి పరిపాటిగా మారిందని అంటున్నారు. గతంలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌లకు రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు, ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించారని చెబుతున్నారు.

పార్టీకి ఆది నుంచి సేవలందిస్తున్న వారిని కాదని గతంలో టీజీ వెంకటేష్‌కు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎంతో మంది రాజ్యసభ సీటు ఆశించారని, వారందరినీ కాదని రవీంద్ర కుమార్‌ను ఎంపిక చేశారని, ఇది పార్టీ నేతలను విస్మరించడమేనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రాజ్య సభ స్థానంపై రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ సీనియర్‌ నేతలు బీద మస్తాన్‌రావు, వర్ల రామయ్య, మసాల పద్మజ, నల్లగట్ల స్వామిదాసు, హేమలత, జూపూడి ప్రభాకర్‌ వంటి వారు ఆశలు పెట్టుకున్నారు. పార్టీకి తాము చేసిన సేవలను అధినాయకత్వానికి వివరించి, రాజ్య సభకు అవకాశం ఇవ్వాలని కోరారు. వారికి న్యాయం చేస్తామని అధినాయకత్వం చెప్పింది. దీంతో వారు తమకు సీటు వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూశారు.

చివరి వరకు వారిని ఊరించిన అధినాయకత్వం, చివరకు తమకు నచ్చిన వారిని రాజ్యసభకు ఎంపిక చేసింది. మరీ ముఖ్యంగా వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దాదాపు ఖరారయింది. ఈమేరకు పార్టీ నాయకత్వం లీకులు కూడా ఇచ్చింది. ఆదివారం ఉదయం వరకు రామయ్యకు సీటు ఖరారయిందన్న వార్తలు వెలువడ్డాయి. ఆదివారం ఉదయం రామయ్య కుటుంబంతో సహా సీఎం నివాసానికి బయల్దేరారు. అయితే, చివరి నిమిషంలో రామయ్య పేరు జాబితా నుంచి మాయమైంది. ఆయన స్థానంలో కనకమేడల రవీంద్రకుమార్‌ పేరు జాబితాలోకి ఎక్కింది. దీంతో రామయ్య తీవ్ర మనస్తాపం చెందారు. విజయవాడ శివారు నుంచే ఆయన తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు.. తనకు అవకాశం ఇవ్వకపోవడంపై కంభంపాటి రామ్మోహన్‌రావు కూడా అసంతృప్తితో ఉన్నారు. రమేష్, రవీంద్ర ఎంపిక ఎంతవరకు న్యాయమని ఆశావహులంతా ప్రశ్నిస్తున్నారు. ఎంపిక తీరుపట్ల యనమలతోపాటు ఇతర సీనియర్లు కూడా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా