అభ్యర్థులేరి..!

10 Mar, 2020 12:34 IST|Sakshi
కేశినేని భవన్‌లో సమావేశంలో మాట్లాడుతున్న బుద్దా వెంకన్న

అన్వేషణ ప్రారంభించిన టీడీపీ

ఆసక్తి చూపని ఆ పార్టీ నాయకులు

దరఖాస్తులు చేసుకోవాలని  ఆశావహులకు ఆఫర్‌  

సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి పోటీకి తెలుగు తమ్ముళ్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎలాగైనా అన్ని స్థానాలలో అభ్యర్థులను పోటీకి దించాలని అర్బన్, జిల్లా నాయకులపై పార్టీ అధిష్టానం బాధ్యత మోపింది. గత సార్వత్రిక ఎన్నికలలో దారుణ ఫలితాలను చవిచూసినందున ఎన్నికల బరిలోకి దిగేందుకు ముఖ్యులు కూడా ముందుకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారని ఆ పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి..
నగరంలో కార్పొరేటర్‌గా ఎన్నికల బరిలోకి దిగాలని ఆశించే అభ్యర్థులంతా ఒకటి రెండు రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం జరిగిన అర్బన్‌ పార్టీ సమావేశంలో అధ్యక్షుడు బుద్దా వెంకన్న సూచించారు. దరఖాస్తుల్లో అంగబలం, ఆర్థికబలం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తా మని చెబుతున్నారు. అయితే తమకు ప్రాబల్యం ఉన్న వార్డులలో తప్ప అనేక వార్డులలో అ భ్యర్థులు ఈసారి ఎన్నికల బరిలోకి దిగక పో వచ్చని అర్బన్‌ పార్టీలోకి కీలక నేత ఒకరు తెలిపారు.  

వారిపైనే ఆర్థిక భారం..
దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న, ఆర్థికంగా బలమైన నేతల్ని, మాజీ కార్పొరేటర్లని బలవంతంగానైనా రంగంలోకి దింపాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరోకవైపు తమకు పరిస్థితులు సానుకూలంగా లేవంటూ అనేక మంది సిట్టింగ్‌లు మోహం చాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేయర్, జెడ్పీ చైర్మన్‌ సీటు ఆశించే అభ్యర్థులపైనే మిగిలిన అభ్యర్థుల ఆర్థిక అవసరాలతో పాటు ఇతర బాధ్యతలను మోపాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం జరిగిన జిల్లా పార్టీ సమావేశం, సోమవారం జరిగిన అర్బన్‌ పార్టీ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా నగరంలో మేయర్‌ అభ్యర్థిగా ఆర్థికంగా స్థితిమంతురాలైన వారి పేరు సూచించమని మాజీ మంత్రి దేవినేని ఉమాను కొంతమంది అర్బన్‌ నేతలు కోరారు. దీంతో మాజీ కార్పొరేటర్, తనకు బంధువు అయిన ఒక మహిళను మేయర్‌ రేస్‌లోకి దింపితే ఆ కుటుంబం పార్టీని ఆదుకునేటట్టు చూస్తానని ఆయన హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పు నియోజకవర్గంలోని 12వ వార్డులో జెడ్పీ మాజీ చైర్మన్‌ గద్దె అనూరా«ధ కార్పొరేటర్‌గా ఎన్నికల బరిలో దిగుతున్నారని పార్టీ ముఖ్య నాయకుడొకరు చెప్పారు.

>
మరిన్ని వార్తలు