లోకేష్‌ ఫేస్‌‘బుక్‌’ లైవ్‌ కట్‌!

2 Apr, 2019 10:59 IST|Sakshi

మంగళగిరిలో తడబడుతున్న చినబాబు

అడ్డంగా బుక్కవుతుండడంతో ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ రద్దు

ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్న లోకేశ్‌ కామెడీ

ఫలితంగా నష్టనివారణ చర్యలకు శ్రీకారం

28వ తేదీ నుంచి లైవ్‌ కట్‌ చేసిన టీడీపీ ఐటీ వింగ్‌

సాక్షి, అమరావతి : మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న మంత్రి నారా లోకేశ్‌కు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఇంతవరకు మాట్లాడే తీరులో మార్పు రాకపోవడంతో పాటు నిత్యం తడబాట్లు, తప్పటడుగులు వేస్తుండడంతో ప్రజల్లో అభాసుపాలవుతున్నారు. సీఎం తనయుడిగా గుర్తింపు తప్పితే తనకంటూ ప్రత్యేకంగా ఎలాంటి గుర్తింపు తెచ్చుకోలేకపోయారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో పదిహేను రోజులుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మధ్యలో మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రచారం నిర్వహించి మళ్లీ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మంగళగిరిలో ప్రచారాన్ని ప్రారంభించారు.

వైరల్‌ : లోకేష్‌.. పసుపు కుంకుమ మాకు రాలే!

వచ్చీ రాగానే వేసేశారు!
నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సభల్లో ప్రతి రోజు ఏదో ఒక మాట తూలుతున్నారు. మార్చి 29న మంగళగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మార్చి 23న కౌంటింగ్‌ పూర్తవగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో అక్కడున్న ఓటర్లంతా నవ్వుకున్నారు. అంతకుముందు ఏప్రిల్‌ 9న పోలింగ్‌ అని మాట జారారు. అలాగే మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకునేందుకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేశ్‌ హాజరయ్యే బహిరంగ సభలు, రోడ్‌ షోలలో చేసిన ప్రసంగం ఆయన అధికార ఫేస్‌బుక్‌ పేజీలో లైవ్‌ వచ్చేది. అయితే గత నెల 28వ తేదీ నుంచి ఆయన లైవ్‌ ప్రసంగాన్ని కట్‌ చేశారు. విజ్ఞత మరచి ప్రసంగిస్తూ ఉండడం.. ఆ వీడియోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తూ ఉండడంతో తెలుగుదేశం ఐటీ వింగ్‌ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. అసలు లైవ్‌ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపేశారు. 

నోరు జారిన లోకేశ్‌.. ఆర్కే సెటైర్‌!

ఓటమిని పరోక్షంగా ఒప్పుకున్నట్లేనా?
సామాజిక, ఆర్థికంగా సమీకరణలు పూర్తయిన తర్వాత మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారనే నమ్మకం కుదిరాకే సీఎం చంద్రబాబు ఆ సీటును తన కుమారుడికి కేటాయించారు. లోకేశ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే మంగళగిరిలో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. స్థానికంగా బలంగా ఉన్న పద్మశాలీయులు ఇతర బీసీ సంఘాలు లోకేశ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాయి. దీనికి తోడు లోకేశ్‌ ప్రసంగాల్లో కామెడీ పుష్కలంగా పండుతుండడంతో ఇలాంటి అభ్యర్థికి ఎలా ఓటేయాలనే ప్రశ్నను ఓటర్లు లేవనెత్తుతున్నారు. దీంతో ఐటీ వింగ్‌ లోకేశ్‌ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని కట్‌ చేయడంతో కొంతలో కొంతైనా ఉపశమనం లభిస్తుందని ఆలోచిస్తున్నారు. సీఎం తనయుడు ప్రసంగాన్ని లైవ్‌లో చూపించలేకపోతున్నారంటే ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్లే అనే భావన ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు