కాషాయ పవనం.. సైకిల్‌పై పయనం

13 Mar, 2020 08:07 IST|Sakshi

కుట్రల పొత్తు పొడుపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా జనసేన

చాలా స్థానాల్లో పోటీకి అభ్యర్థులను నిలపని వైనం

కొన్నిస్థానాల్లో రెండు పార్టీలూ పోటీ చేయని వైనం

టీడీపీతో లోపాయికారీ ఒప్పందం

ఇరు పార్టీల వైఖరిపై ప్రజల్లో చర్చ

కాషాయంతో దోస్తీ కట్టిన పవన్‌ కళ్యాణ్‌.. మళ్లీ సైకిల్‌పైనే మనసు పారేసుకున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో ‘పొత్తు’ పొడిచినా.. ‘పచ్చ’బొట్టును చూసి మనసుమార్చుకున్నాడు. కుట్రలకు తెరతీసి     పాతమిత్రునికే లబ్ధి కలిగేలా పావులు కదుపుతున్నాడు. ప్రశ్నించేందుకే వచ్చామంటూ.. ఇప్పటికే జనంలో పలుచనైన జనసేనాని.. ఫ్యాన్‌ గాలిని తట్టుకోలేక స్థానికంలోనూ సైకిలెక్కి దిగజారుడు రాజకీయం చేస్తుండటం గమనార్హం.

అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ బంధం ఈ నాటిది కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ ఆయనకు అనుకూలంగానే ఉంటారు. తాను ప్రజాగొంతుక అని చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌.. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై ఏ సందర్భంలోనూ çపల్లెత్తు మాట అనలేదు. పైగా అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్‌సీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ ఒంటిరిగా పోటీ చేస్తామని చెప్పి.. చివరి నిముషంలో చేతులెత్తేశారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినా నామమాత్రంగా బరిలో నిలిపి పరోక్షంగా టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జనసేన ఇదే వైఖరి అవలంబిస్తోంది. బీజేపీతో పొత్తు కుదిరినా.. చాలా స్థానాల్లో పోటీకి దూరంగా ఉంది. దీని వెనుక టీడీపీ మంత్రాంగం నడిపిందనే విషయం స్పష్టమవుతోంది. 

సార్వత్రికంలో సై..స్థానికంలో నై...
గత సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన కొట్రికే ముధుసూదన్‌ 20వేల ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచాడు. జనసేన పార్టీ అభ్యర్థుల్లో రాయలసీమలోనే అత్యధిక ఓట్లు సాధించాడు. ఈ నియోజకవర్గంలోనూ జనసేన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలుప లేదు. మరోవైపు బీజేపీ కూడా ఈ నియోజకవర్గంలో అభ్యర్థులను నిలపకపోవడం చూస్తే.. టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ రకమైన ఎత్తుగడ వేశారనే వాదనకు బలం చేకూరుస్తోంది.

13 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీకిబీజేపీ, జనసేన దూరం
జిల్లాలోని 63 జెడ్పీటీసీ స్థానాలకు గాను 13 స్థానాల్లో అటు బీజేపీ గానీ, ఇటు జనసేన పార్టీగాని అభ్యర్థులను నిలపడం లేదు. ఆత్మకూరు, డి.హీరేహాళ్, గుంతకల్లు, కణేకల్లు, కూడేరు, ఓడీ చెరువు, పామిడి, పెద్దపప్పూరు, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, శింగనమల, యల్లనూరు జెడ్పీటీసీ స్థానాల్లో ఈరెండు పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి.  అలాగే 841 ఎంపీటీసీ స్థానాలకు గాను బీజేపీ 200, జనసేన 83 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నాయి. తక్కిన 358 స్థానాల్లో ఆ రెండు పార్టీలుపోటీ చేయలేదు. పుట్లూరు, పెనుకొండ, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పామిడి, ఓడీ చెరువు, కూడేరు, ఆత్మకూరు, బుక్కపట్నం, డి.హీరేహాళ్, గుంతకల్లు, కణేకల్లు, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, శింగనమల, యల్లనూరు మండలాల్లో ఒక్క ఎంపీటీసీ స్థానాలకు కూడా బీజేపీ, జనసేన పోటీ చేయకపోవడం విశేషం. మరికొన్ని మండలాల్లో ఒకట్రెండు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను బరిలో నిలిపారు.

పాతబంధానికే ప్రాధాన్యత
ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన టీడీపీతో ఉన్న బంధాన్ని తెంచుకోలేకపోతోంది. ఎలాగైనా సరే టీడీపీకి లబ్ధి కలిగేలా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో చాలా స్థానాల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుంది. కొన్నిచోట్ల పోటీ చేస్తున్నా.. అదీ నామమాత్రమే. ప్రజల్లో తమ పార్టీ పట్ల మరో అభిప్రాయం రాకూడదనే ఉద్దేశంతో నామమాత్రంగా పోటీలో నిలిచినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.  

జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు : 63
బీజేపీ, జనసేన నామినేషన్లు దాఖలు చేయని స్థానాలు :13
జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు :841
బీజేపీ, జనసేన పార్టీలు నామినేషన్లు దాఖలు చేయని స్థానాలు ;358

మరిన్ని వార్తలు