టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకమై దాడులు

14 Mar, 2020 12:10 IST|Sakshi
కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త బత్తెయ్య

తొట్టంబేడులో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓ కార్యకర్త హత్య

ఎమ్మెల్యే అభ్యర్థిని ఎత్తుకెళ్లి దాడి

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే   అభ్యర్థిని ప్రచారం చెయ్యనివ్వని బొజ్జల వర్గీయులు

టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకమయ్యాయి. గతంలో మాదిరిగా దాడులకు పూనుకున్నాయి. రౌడీ మూకలఅండతో రెచ్చిపోయాయి. అధికార పార్టీ నాయకులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించాయి. అనరాని మాటలతో రెచ్చగొట్టాయి. నామినేషన్లు వేయనీయకుండా అడ్డుతగిలాయి. అడ్డొచ్చిన కార్యకర్తలపై కత్తులు దూశాయి. విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డాయి. రక్తసిక్తం చేస్తూ భయాందోళనలు సృష్టించాయి. అధికారులనూ హడలెత్తించాయి. స్థానిక పోరులో తమ కండకావరాన్ని ప్రదర్శించాయి. ప్రతిపక్షాల దౌర్జన్య కాండపై జిల్లా ప్రజానీకం పెదవి విరుస్తోంది.   

సాక్షి, తిరుపతి:  దాడులు.. దౌర్జన్యాలు.. హత్యలు చెయ్యడంలో టీడీపీ శ్రేణులు ఆరితేరిపోయాయి. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. టీడీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దతిప్పసముద్రం మండలం రామాపురం వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటరమణారెడ్డిని టీడీపీ నాయకులు హత్యచేశారు. ఆ ఎన్నికల్లోనే పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ బాబు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. ఎంఎస్‌ బాబును ఎత్తుకెళ్లితీవ్రంగా దాడిచేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన అనుచరుల సహకారంతో ఆస్పత్రిలో చేరి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రామచంద్రాపురం మండలంలో అడుగడుగునా అడ్డుకున్నారు. గణేశ్వరపురంలో కారును ధ్వంసంచేసి దాడికి తెగబడ్డారు. ముంగిలిపట్టులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రచారానికే రానివ్వకుండా అడ్డుకున్నారు. టీటీ కండ్రిగలో జనరల్‌ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రానికి రానివ్వకుండా రాళ్లు రువ్వుతూ దాడికి తెగబడ్డారు.

దళితులను ఓటెయ్యనివ్వని చరిత్ర టీడీపీది
రామచంద్రాపురం మండలం ఎన్‌ఆర్‌ కమ్మపల్లి దళితులను చంద్రబాబు సామాజిక వర్గం వారు  ప్రతి ఎన్నికల్లో ఓటెయ్యనివ్వకుండా అడ్డుకుంటూ వచ్చారు. సుమారు 40 ఏళ్లు దళితులు ఓట హక్కును వినియోగించుకున్న దాఖలాలు లేవు. ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవతో దళితులు రీపోలింగ్‌ సమయంలో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సదుం, సోమలలో 2015లో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. కుప్పంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటవ వార్డు పోలింగ్‌ స్టేషన్‌లోకి చొరబడి బ్యాలెట్‌ బాక్సును ఎత్తుకెళ్లారు.  ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటేష్‌బాబుపై దాడిచేశారు. శ్రీకాళహస్తి పరిధిలోని మన్నవరం గ్రామంలో బియ్యపు మధుసూదన్‌రెడ్డిని ప్రచారం చెయ్యనివ్వకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో 23 వార్డు కౌన్సిలర్‌గా నామినేషన్‌ వెయ్యనివ్వకుండా అడ్డుకున్నారు. పార్థసారథిని చైర్మన్‌ చేసేందుకు కౌన్సిలర్‌ రంగస్వామిని కిడ్నాప్‌చేశారు. పాలసొసైటీ ఎన్నికల్లో మునిరాజనాయుడు వైఎస్సార్‌సీపీ శ్రేణులను నామినేషన్లు వెయ్యకుండా దౌర్జన్యం చేశారు. పుత్తూరులో ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను మహిళ అని కూడా చూడకుండా ప్రభు త్వ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనకుండా దౌర్జన్యానికి దిగారు. నగ రిలో గంగజాతర సందర్భంగా ఎమ్మెల్యే రోజా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శాంతిపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. 1989లో మదనపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు బ్యాలెట్‌ పెట్టెలను తీసుకెళ్లి చెరువులో పడేశారు. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
తాజాగా శుక్రవారం తొట్టంబేడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను హతమార్చేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. బీడీ కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త బత్తెయ్య (40)పై కొందరు ముసుగులు ధరించి కత్తులతో దాడిచేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. కత్తుల దాడిలో బత్తెయ్య తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

మరిన్ని వార్తలు