ఆ వార్తలు అవాస్తవం: తోట త్రిమూర్తులు

20 Jun, 2019 15:10 IST|Sakshi

సాక్షి, కాకినాడ: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తోసిపుచ్చారు. తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీజేపీలోకి వెళుతున్నామన్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా టీడీపీకి చెందిన కాపు నాయకులంతా గురువారం కాకినాడలోని ఓ ప్రయివేట్‌ హోటల్‌లో సమావేశం అయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి  మీసాల గీత, వరుపుల రాజా, బొండా ఉమా, బడేటి బుజ్జి, పంచకర్ల రమేష్‌ బాబు, కదిరి బాబూరావు, ఈలి నాని, జ్యోతుల నెహ్రు, కేఏ నాయుడు, వేదవ్యాస్‌, చెంగల్రాయుడు, బండారు మాధవ నాయుడు తదితరులు హాజరయ్యారు. దాదాపు 20మంది మాజీ ఎమ్మెల్యేలు... పార్టీలో తమ భవిష్యత్‌, రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..’ టీడీపీకి చెందిన కాపు నాయకులంతా సమావేశం పెట్టుకున్నాం. ఒక సామాజిక వర్గానికి చెందిన సమావేశం కావడంతో హోటల్‌లో భేటీ జరిగింది. లేకుంటే పార్టీ కార్యాలయంలోనే మీటింగ్‌ పెట్టుకుని ఉండేవాళ‍్లం. సామాజిక వర్గ సమస్యలపై మాట్లాడుకోవడానికే ఈ భేటీ నిర్వహించాం. అంతేకాకుండా ఓటమిపై సమీక్ష కూడా జరుపుకున్నాం.’ అని పేర్కొన్నారు.

అయితే చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు భేటీ కావడం వెనుక ...పక్కా ప్లాన్‌ ప్రకారమే జరుగుతున్నట్లు సమాచారం. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లేముందే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారని, ఆ స్క్రిప్ట్‌ ప్రకారమే టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు అయిదుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని బీజేపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరిలో సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి బీజేపీలో చేరనున్నారు. వీరంతా 15 రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు టీడీపీ కాపు నేతలతో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా టచ్‌లో ఉన్నారని భోగట్టా. అయితే ఇదంతా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

చదవండి: టీడీపీలో భారీ సంక్షోభం! 

మరిన్ని వార్తలు