చంద్రబాబుతో భేటీకి కాపు నేతల డుమ్మా

28 Jun, 2019 13:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశానికి టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు మొహం చాటేశారు. అధినేతతో భేటీకి ఈరోజు చంద్రబాబు నివాసానికి రావాలని కోరినా కాపు నేతలు హాజరుకాలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు. అధినాయకత్వంపై అసంతృప్తితో ఈ నెల 20న కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించిన కాపు నేతలను బుజ్జగించే చర్యల్లో భాగంగా ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో గురువారం రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. కాకినాడలో సమావేశమైన నాయకులను చంద్రబాబుతో భేటీకి తీసుకురావాలని కోరారు. అయితే శుక్రవారం కాపు నేతలు ఎవరూ రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు.  

మరోవైపు చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్‌కు సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సంజాయిషీ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి పార్టీ కార్యాలయంలో ఆయన అందుబాటులో ఉంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. జూలై 2, 3 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. నామినేషన్‌ వేయడానికి తాను రాకపోయినా అభిమానంతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. (చదవండి: కాకినాడలో టీడీపీ కాపు మాజీ ఎమ్మెల్యేల భేటీ)

మరిన్ని వార్తలు