శిద్దా, మాగుంటతో మంతనాలు..

12 Mar, 2019 12:10 IST|Sakshi
మంత్రి శిద్దా రాఘవరావుతో చర్చలు జరుపుతున్న దామచర్ల

మంత్రి శిద్దా, ఎమ్మెల్సీ మాగుంటతో దామచర్ల చర్చలు

పార్టీ మారడం పునరాలోచించుకోవాలని మాగుంటకు హితవు

నేతల ఇళ్ల వద్ద కార్యకర్తల హడావుడి

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో అధికార తెలుగుదేశంలో వేడి మొదలైంది. ముఖ్యమైన నేతలు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో ఏం చేయాలో తెలియని డోలాయమానంలో పడింది. దీంతో అధిష్టానం జిల్లా అధ్యక్షుడు దామచర్లను రంగంలోకి దింపి సర్దుబాటు చర్యలు ప్రారంభించినా.. ఎక్కడా ఓ కొలిక్కి రాలేదు.

ఒంగోలు సబర్బన్‌: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో అధికార టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఆ ప్రచారం కాస్త జోరందుకుంది. అదే విధంగా జిల్లా మంత్రి శిద్దా రాఘవరావును దర్శి అసెంబ్లీకి కాకుండా ఒంగోలు పార్లమెంట్‌కు నిలబడాలని పార్టీ అధిష్టానం వత్తిడి తీసుకువస్తోంది. దీన్ని దర్శిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు అంశాలపై అధికార టీడీపీలో పెద్ద దుమారమే రేగింది. ఈ సమాచారాన్ని ఇంటిలిజెన్స్‌ నిఘా ద్వారా పసిగట్టిన టీడీపీ అధిష్టానం జిల్లాలోని పరిస్థితులపై దృష్టి సారించింది. ఈ రెండు వ్యవహారాలను తక్షణమే సర్దుకునే చర్యలు చేపట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ను పురమాయించింది. దీంతో దామచర్ల రంగంలోకి దిగి ఇరువురు నాయకులతో విడివిడిగా చర్చలు జరిపారు.

శిద్దా, మాగుంటతో మంతనాలు..
మంత్రి శిద్దా రాఘవరావును పార్లమెంట్‌కు వద్దని, దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేలా పార్టీ అధిష్టానం తన మనసు మార్చుకోవాలంటూ దర్శి నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఒంగోలు నగరానికి చేరుకున్నారు. పార్లమెంట్‌కు నిలబడేందుకు అంగీకరించవద్దని శిద్దాపై వత్తిడి చేశారు. దీంతో సమాచారం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మంత్రి శిద్దా రాఘవరావు ఇంటికి చేరుకొని కొంతసేపు చర్చలు జరిపారు. నాయకులు, కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేయాలని చూశారు. అంతకు ముందు రామ్‌నగర్‌ రెండో లైన్‌లో ఉన్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసానికి దామచర్ల జనార్దన్‌ చేరుకున్నారు. తొలుత మాగుంటతో ఏకాంతంగా చర్చలు జరిపారు. అధిష్టానం నిర్ణయం మేరకు పార్టీ మారే ఆలోచనను పునరాలోచించుకోవాలంటే బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం దామచర్లతో పాటు బయటకు వచ్చిన మాగుంట మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్‌ కార్యాచరణను త్వరలో బయటపెడతానని వెల్ల్లడించారు. సన్నిహితులతో, అభిమానులతో మాట్లాడిన తరువాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని,  సంయమనం పాటించాలని హితవు పలికారు.

మరిన్ని వార్తలు