‘కాల్వ’ వీరంగం.. రాయదుర్గంలో ఉద్రిక్తత

14 Mar, 2020 19:32 IST|Sakshi

ఎన్నికల అధికారులపై కాల్వ  శ్రీనివాస్‌ వీరంగం

సాక్షి, అనంతపురం : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్‌ ఎన్నికల అధికారులపై రౌడీయిజం ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు పిల్లలు కలిగిన అభ్యర్థులతో ఉద్దేశపూర్వకంగానే నామినేషన్‌ వేయించారు. అయితే ఎన్నికల అధికారులు దానిని తిరస్కరించారు.  దీంతో తన అనుచరుల నామినేషన్‌ను ఆమోదించాలంటూ రాయదుర్గం మున్సిపల్‌ కార్యాలయంలోకి చొరబడి.. కాలువ శ్రీనివాస్‌ ఎన్నికల అధికారులపై వీరంగం సృష్టించారు. అధికారులపై బెదిరింపులకు దిగారు. ఆయన దౌర్జన్యాలపై అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాలువ శ్రీనివాస్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ పులనాగరాజుతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రాయదుర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

టీడీపీ నేతల దౌర్జన్యాలపై ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కాలువ శ్రీనివాస్ గూండాగిరిపై కలెక్టర్, ఎస్పీ లకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తోందని ప్రభుత్వ విప్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు