టీడీపీలో రగడ

19 Jan, 2019 07:36 IST|Sakshi
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 13న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణారావు పూజలు. వెనుక ఉన్న, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోంబాబు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను కలసిన టీడీపీ జిల్లా నేత సోంబాబు

చర్యలు తీసుకోవాలంటున్న పార్టీ నాయకులు

ముదురుతున్న వివాదం

పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: జిల్లా టీడీపీ నాయకుల్లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ద్వారకాతిరుమల చినవెంకన్న దర్శనార్థం ఇటీవల క్షేత్రానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావుకు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని సోంబాబు ఆహ్వానం పలికి, ఆయన వెన్నంటే ఉండటంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇక ప్రత్యర్థి వర్గం వారైతే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, సోంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ప్రస్తుతం వార్‌ నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేత, జిల్లా పశుసంవర్ధక శాఖ చైర్మన్‌ పాకలపాటి గాంధీ, మరికొందరు నాయకులు సోంబాబు తీరును తప్పుబట్టారు. అయితే సోంబాబు ఎల్లో మీడియా ద్వారా తన తప్పులను కప్పిపుచ్చుకునే యత్నం చేస్తున్నారని అదే పార్టీకి చెందిన పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దీంతో సోంబాబు వ్యవహారం రోజురోజుకూ రచ్చకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఇరువర్గాలుతరచూ ప్రెస్‌మీట్లను నిర్వహించి, ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ వివాదం చివరకు ఎటు దారితీస్తుందోనని పార్టీ శ్రేణులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామిని  దర్శించేందుకు ఈనెల 13న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాదవరపు కృష్ణారావు ఆలయానికి వచ్చారు. ఈ సమయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని సోంబాబు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణారావుకు ఘన స్వాగతం పలికి, అన్ని ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకున్నారు. దీన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. దివంగత టీడీపీ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది హరికృష్ణ కుమార్తెను బరిలోకి దింపడంతో ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. అయితే నందమూరి సుహాసినిని కృష్ణారావు ఓడించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి టీడీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇలాంటి సమయంలో శ్రీవారి ఆలయానికి వచ్చిన కృష్ణారావుకు సోంబాబు  ఆహ్వానం పలకడం టీడీపీలో దుమారాన్ని రేపుతోంది.

ప్రతిపక్షాన్ని ఎలా విమర్శించాలి..
టీఆర్‌ఎస్, వైఎస్సార్‌ సీపీ రెండూ ఒక్కటేనని ఒక పక్క టీడీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. మరో పక్క ఏపీకి వస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలు బహిరంగంగా కలుస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే.. తమదంతా ఒకే సామాజికవర్గమని చెప్పుకొస్తున్నారు. తమ కమ్యూనిటీ అభివృద్ధి కోసం కలుస్తున్నామని అంటున్నారు. అయితే ఈ మాటలను టీడీపీ నేతలు పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కులం కోసం పార్టీకి అన్యాయం చేస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు. మన పార్టీ నాయకులే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే.. ఇక వైఎస్సార్‌ సీపీని ఎలా విమర్శించాలంటూ వారిలో వారు మదన పడుతున్నారు.

చంద్రబాబు ఆగ్రహం..
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను టీడీపీ నేతలు కలుస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిర్వహించే పర్యటనల్లో టీడీపీ నేతలు ఎవరు పాల్గొన్నా, వారిని పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలని, స్నేహాలు వ్యక్తిగతంగా చేసుకోవాలని పేర్కొన్నట్టు సమాచారం. 

చర్యలు తీసుకోవాల్సిందే..
చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ పూర్తయిన తరువాత ద్వారకాతిరుమల ఎంపీపీ కార్యాలయంలో జిల్లా పశుసంవర్ధక శాఖ చైర్మన్‌ గాంధీ, ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువరప్రసాద్, నాయకులు డీవీఎస్‌ చౌదరి, మొగతడకల శ్రీనివాసరావు, పోలిన శ్రీనివాసరావు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. గాంధీ మాట్లాడుతూ సోంబాబు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణారావును కలవడం సరికాదన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే అనుచరుడిగా ఉంటూ, సోంబాబు ప్రవర్తించిన తీరును తాము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశం పూర్తయిన వెంటనే సోంబాబు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిపెద్ది వెంకటేశ్వరరావు నివాసంలో ఎల్లో మీడియాతో మాట్లాడారు. తాను కులపరంగా మాత్రమే కృష్ణారావును కలిశానని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో పాకలపాటి గాంధీపై  తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ప్రస్తుతం ఇరువర్గాల మధ్య వాడివేడిగా విమర్శలపర్వం కొనసాగుతోంది.

‘డీసీసీబీ ఓటమికి సోంబాబే కారణం’
గత సొసైటీ ఎన్నికల్లో డీసీసీబీని టీడీపీ గెలుపొందలేక పోవడానికి ప్రధాన కారణం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని సోంబాబేనని ఆ పార్టీ నేత, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాకలపాటి గాంధీ విమర్శించారు. మండలంలోని తిమ్మాపురంలో పార్టీ నేత పోలిన శ్రీను ఇంటి వద్ద శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..  సోంబా బుపై మరోమారు ఆరోపణలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణారావుకు సోంబాబు ఆహ్వానం పలకడాన్ని ఖండించామని, దీనికి ప్రతిగా సోంబాబు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు.

నాయకత్వ లోపం ఎవరిది..!
జి.కొత్తపల్లి సొసైటీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ప్రధాన కారణం సోంబాబేనని గాంధీ విమర్శించారు. జి.కొత్తపల్లి, ద్వారకాతిరుమల సొసైటీల్లో ఓటమి వల్లే డీసీసీబీ చేజారిందని పేర్కొన్నారు. ద్వారకాతిరుమల సొసైటీలో దాదాపు 12 డైరెక్టర్‌ పదవులు టీడీపీ గెలిచినా, అధ్యక్ష పదవి కాంగ్రెస్‌ను వరించడం వెనుక సోంబాబు పాత్ర ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సోంబాబు టీడీపీలోకి వచ్చిన అనంతరం  మద్దులగూడెం, కొమ్మర, కోడిగూడెం, సీహెచ్‌.పోతేపల్లి తదితర పంచాయితీల్లో టీడీపీకి మెజారిటీ రావడం లేదని, దీనికి సోంబాబు నాయకత్వ లోపమే కారణమా.. లేక టీడీపీ లోపమా అన్నది తెలియడం లేదని ఎద్దేవా చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే సహాయంతో సోంబాబు తన ప్రాంత వాసులకు సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారని, అయినా ఓటింగ్‌ ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. సోంబాబు తమపై ఆరోపణలు చేసినప్పుడు తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నానని, ఆయనే చర్చకు సమయాన్ని, ప్రదేశాన్ని నిర్ణయిస్తే బాగుంటుందన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువరప్రసాద్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు డీవీఎస్‌.చౌదరి, తూంపాటి సుధీర్, గంటా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు