ముస్లింలకు ‘దేశం’లో ఇంతేనా మర్యాద

5 May, 2018 11:55 IST|Sakshi
మంత్రి గంటాను నిలదీస్తున్న మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్‌

స్టేజ్‌ బ్యానర్‌లో ఒక్క మైనారిటీ సోదరుడి ఫొటో లేదు

ముందు మేం మాట్లాడకుండా మీరు ఉపన్యాసాలిచ్చి వెళ్లిపోతే ఎలా..

మంత్రి గంటాను  కడిగిపారేసిన మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్‌

అలిగి ప్రసంగించకుండానే వెళ్లిపోయిన మంత్రి

ఆ వెనకే జారుకున్న ఎమ్మెల్యే పంచకర్ల

టీడీపీలో మైనారిటీలకు విలువే లేకుండా  పోతోందన్న ముస్లిం నేతలు

హాట్‌హాట్‌గా సాగిన ముస్లింల ఆత్మీయ సభ

‘వేదికపై బ్యానర్‌లో జిల్లాకు చెందిన ఒక్క మైనారిటీ నాయకుడి ఫొటో లేదు.. అసలు ఇది ముస్లింల ఆత్మీయ సదస్సేనా?!..తెలుగుదేశం పార్టీలో ముస్లింలకు ఇచ్చే గౌరవం ఇంతేనా’..  ఇదీ మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్‌ ఎస్‌.ఎ.రెహ్మాన్‌ ఆవేదన, ఆక్రోశం.అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు దీన్నేమాత్రం పట్టించుకోలేదు..నాకు అర్జంట్‌ పనుంది.. రెండు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతాను.. అని ముందుకొచ్చారు.దానికి రెహ్మాన్‌ కుదరంటే కుదరదని స్పష్టీకరించారు.. మా ముస్లిం మైనారిటీ నేతలు మాట్లాడే వరకు ఉండలేరా.. మా బాధలు కూడా వినలేరా.. మీ ప్రసంగాల కోసమే మేం వచ్చామా?.. అని రుసరుసలాడారు.దీంతో అలిగిన గంటా సభలో మాట్లాడకుండానే వేదిక దిగి వెళ్లిపోయారు.శుక్రవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన జిల్లా ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో చోటుచేసుకున్న ఈ హాట్‌ హాట్‌ పరిణామాలు..  పార్టీలో మైనారిటీలకు లభిస్తున్న గౌరవాన్ని చెప్పకనే చెప్పాయని స్వయంగా ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి,  విశాఖపట్నం: టీడీపీలో ముస్లిం మైనారిటీలకు ఏపాటి గౌరవం ఉందో తేటతెల్లమైంది. కేవలం ఆ వర్గం కోసం నిర్వహించిన సమావేశంలో కూడా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడంపై మైనారిటీలు మండిపడుతున్నారు. నగరంలోని ఎన్టీఆర్‌ భవన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన విశాఖ జిల్లా ముస్లిం మైనారిటీల సదస్సుకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్, కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్‌ ఎస్‌.ఎ.రెహ్మాన్, టీడీపీ విశాఖ అర్బన్, రూరల్‌ జిల్లాల అధ్యక్షులు వాసుపల్లి గణేశ్, పంచకర్ల రమేష్‌ హాజరయ్యారు. సదస్సు ఆ పార్టీలోని మైనారిటీ నేతల పట్ల వివక్షను బట్టబటయలు చేసింది. పార్టీలో ముస్లిం మైనారిటీలకు విలువే లేకుండా పోతుందని మొత్తుకున్నా పట్టించుకోకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు విసురుగా వెళ్లిపోవడం వివాదాస్పదమవుతోంది.

ఇదీ పరిస్థితి
తొలుత వాసుపల్లి, పంచకర్ల, చాంద్‌ బాషా మాట్లాడిన తర్వాత మంత్రి గంటా ప్రసంగించేందుకు ముందుకొచ్చారు. ఆ సమయంలో పక్కనే సభావేదికపైన ఉన్న రెహ్మాన్‌ లేచి... ఇది జిల్లా మైనారిటీల ఆత్మీయ సదస్సేనా... జిల్లా ముస్లిం నేత ఒక్కరు కూడా మాట్లాడకుండా మీరు మాట్లాడేసి వెళ్లిపోతే ఎలా.. అని గంటాను నిలదీశారు. ఇందుకు గంటా .. నాకు పనిఉంది.. రెండు నిమిషాలు మాట్లాడేసి వెళ్లిపోతాను అని చెప్పుకొచ్చారు. దీనిపై రెహ్మాన్‌ ఘాటుగా స్పందించారు. మొక్కుబడిగా మాట్లాడేందుకు ఎందు కు అని నిలదీస్తుండగా, వాసుపల్లి గణేష్‌ పరుగుపరుగున వచ్చి.సార్‌కు పని ఉంది.. ఆయన్ను మాట్లాడనివ్వండి.. అని రెహ్మాన్‌కు సూచించారు. దానికి ఆయన అంగీకరించలేదు. దీంతో అలిగిన గంటా అగ్రహంతో సభావేదిక దిగి వెళ్లిపోయారు.

అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు..ఆ విషయాన్ని గంటా వద్ద ప్రస్తావించగా   స్పందించకుండా వెళ్లిపోయారు. గంటా వెళ్లిన తర్వాత  పార్టీ  శ్రీకాకుళం మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు నహీబుల్లాఖాన్‌ మాట్లాడుతూ..జిల్లా ముస్లిం మైనారిటీ ఆత్మీయ సభావేదిక బ్యానర్‌పై జిల్లాలో ఉన్న ఒక్క ముస్లిం సోదరుడి ఫొటోనైనా వేశారా?..ఇదేనా టీడీపీలో ముస్లింలను గౌరవించుకోవడం అని ఆవేదన వ్యక్తం చేశారు. దీం తో అప్పటి వరకు కూర్చున్న జిల్లా రూరల్‌ అధ్యక్షుడు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు విసురుగా లేచి వెళ్లిపోయారు. ముస్లిం మైనారిటీలు తమ కు  ప్రాధాన్యం ఇవ్వాలని కోరినందుకే  మంత్రి గంటా, పంచకర్లలు ఏమాత్రం లెక్కలేకుండా విసురుగా వెళ్లిపోవడం పార్టీ వర్గాల్లో చర్చాంశనీయమైంది. టీడీపీలోనే ఎమ్మెల్యేగా, వుడా చైర్మన్‌గా పనిచేసి సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న రెహ్మాన్‌ ఆవేదనను కనీసం పట్టించుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

మరిన్ని వార్తలు