వైఎస్సార్‌సీపీలో చేరితే ఖబడ్దార్‌

22 Dec, 2018 11:35 IST|Sakshi

గ్రామస్తులపై చిత్తూరు జిల్లా పీలేరు టీడీపీ ఇన్‌చార్జి కిశోర్‌కుమార్‌రెడ్డి దౌర్జన్యం

మీ ఇళ్లను ధ్వంసం చేయడానికైనా వెనుకాడనని హెచ్చరిక

సాక్షి, చిత్తూరు: సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని భావిస్తున్న వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారు. కలికిరి మండలం బాలయ్యకుంట వడ్డిపల్లి గ్రామంలో 70 కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాలన్నీ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా ఉంటూ వచ్చాయి. ఆయన తమ్ముడు కిశోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరడం వారికి నచ్చలేదు. ఆ గ్రామంలోని దాదాపు 40 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాయి. దీనికోసం 45 రోజులుగా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని సంప్రదిస్తున్నారు.

శనివారం (22వ తేదీన) ఎంపీ మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేర్చుకుంటామని గ్రామస్తులకు ఆయన చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పీలేరు టీడీపీ ఇన్‌చార్జి కిశోర్‌కుమార్‌రెడ్డి గ్రామస్తులను బెదిస్తున్నారు. ‘‘మీరు ఎలా వైఎస్సార్‌సీపీలో చేరుతారో చూస్తా’’ అంటూ బెదిరిస్తున్నారు. మీ ఇళ్లను ధ్వంసం చేయడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. దీంతోపాటు 22నే గ్రామదర్శిని కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఆశ్రయించారు. ఆయన గ్రామస్తులను వెంటబెట్టుకొని చిత్తూరు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను శుక్రవారం కలిశారు. ‘ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోనైనా చేరేందుకు స్వేచ్ఛ ఉంది. ప్రశాంతగా ఉన్న గ్రామంలో చిచ్చు రేపొద్దు’ అని ఎస్పీ సూచించారు.

రంగంలోకి ఎక్సైజ్‌ పోలీసులు
ఎస్పీ న్యాయంగా వ్యవహరించడంతో కిశోర్‌కుమార్‌రెడ్డి ఎక్సెజ్‌ పోలీసులను రంగంలోకి దింపారు. గ్రామంలో చెరకు గానుగ ఆడిస్తుంటారు. వడ్డెపల్లితో పాటు మిగతా గ్రామాల్లోనూ నల్లబెల్లం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని వైఎస్సార్‌సీపీలో చేరాలనుకున్నవారి ఇళ్లపై ఎక్సైజ్‌ పోలీసులతో దాడి చేయించారు. నల్లబెల్లంతో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారనే నెపంతో నాగన్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎవరూ లేని సమయంలో తమ ఇంటి తాళం పగలగొట్టడం ఏంటని ప్రశ్నించింనందుకు నాగయ్య భార్యపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. శనివారం ఎక్సైజ్‌ పోలీసులు వడ్డిపల్లిలో దాడులు నిర్వహిస్తారని తెలిసింది. 

మరిన్ని వార్తలు