దోపిడీ పథకంగా నీరు–చెట్టు

28 Jul, 2018 07:47 IST|Sakshi
మాట్లాడుతున్న మాజీ ఇన్‌చార్జ్‌ ఇరిగెల రాంపుల్లారెడ్డి

రుద్రవరం: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నీరుచెట్టు పథకం పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె అనుచరుల దోపిడీకి అడ్డాగా మారిందని  టీడీపీ మాజీ ఇన్‌చార్జ్‌ ఇరిగెల రాంపుల్లారెడ్డి విమర్శించారు. స్థానికేతరులతో పనులు చేయించి రూ.కోట్లు ఆర్జించారని ఆరోపించారు. రూ. 5లక్షల ఎంపీ ల్యాడ్స్, రూ.15లక్షల ఉపాధి  కర్నూలు జిల్లా నిధులతో రుద్రవరం మండలం నర్సాపురం సమీపంలో పెద్దబావి రస్తా నిర్మాణానికి ఎంపీటీసీ సభ్యుడు బలరామిరెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. కార్యక్రమానికి ఇరిగెల హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుగంగ కాలువలు అధ్వానంగా ఉన్నా మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ఆమెకు అక్రమార్జనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు.

నీరు – చెట్టు పథకం కింద అళ్లగడ్డ నియోజవర్గంలో రూ.100కోట్ల పనులు చేపట్టగా 20శాతం పనులు కూడా చేయించకుండా నిధులు మింగేశారని ఆరోపించారు. వీరి తీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. నీరు–చెట్టు పనులపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు. నెలరోజుల్లో సీఎం స్పందించకుంటే జిల్లాలో చాలా మార్పులు ఉంటాయని హెచ్చరించారు.    కార్యక్రమంలో ఆళ్లగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు చాంద్‌బాషా, నర్సాపురం నాయకులు సుద్దుల క్రిష్ణుడు, రుద్రవరం టీడీపీ నాయకులు మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు