చంద్రబాబు సమక్షంలో డిష్యుం..డిష్యుం!

28 Nov, 2019 05:29 IST|Sakshi
చంద్రబాబు ఎదుట కొండా సుబ్బయ్యపై దాడి చేస్తున్న శ్రీనివాసులు రెడ్డి అనుచరులు

సాక్షి ప్రతినిధి కడప: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు సమక్షంలోనే కడపలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఓ దళిత నేతను చితక్కొట్టారు. మూడు రోజుల పార్టీ సమీక్షలో భాగంగా స్థానిక శ్రీ సాయి శ్రీనివాస కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గాల సమీక్ష రెండవ రోజు మంగళవారం అర్ధరాత్రి కడప సమీక్షా సమావేశం జరిగింది. కడపతోపాటు జిల్లాలో పార్టీ భ్రష్టు పట్టడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తీరే కారణమని కడప శివానందపురం 15వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ కొండా సుబ్బయ్య చంద్రబాబు సమక్షంలోనే ఆరోపించారు. వెంటనే అనుచరులు కొండా సుబ్బయ్యపై దాడికి దిగి చితక్కొట్టారు.

అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలపై కూడా దాడి చేశారు. గాయపడిన సుబ్బయ్యను అనుచరులు రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో సుబ్బయ్య ఫిర్యాదు మేరకు రిమ్స్‌ పోలీసులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, అందూరి రాంప్రసాద్‌రెడ్డి, పాతకడప కృష్ణారెడ్డి, రాజశేఖర్, శివారెడ్డి, తూపల్లె ఆదిరెడ్డి, ఆలంఖాన్‌పల్లె బాషాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సుబ్బయ్యపై దాడిని నిరసిస్తూ అతని అనుచరులు, దళిత సంఘాల నేతలు బుధవారం ఉదయం కడప ఆర్టీసీ బస్టాండు వద్దగల అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఆందోళనకు దిగారు. 

బాబూ.. అంతా మీరే చేశారు..
కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల తదితర నియోజకవర్గాల సమీక్షల్లో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు  చంద్రబాబుపైనే విమర్శలకు దిగారు. పార్టీ మునగడానికి మీరే కారణమని కమలాపురం మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు సాయినాథశర్మ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఆదినారాయణరెడ్డిని చేర్చుకుని జమ్మలమడుగుతో పాటు జిల్లాలో పార్టీని సర్వనాశనం చేశారని ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు సుమంత్, నాగేశ్వరరావు బాబుపై విమర్శలు గుప్పించారు. వ్యాపారస్తుడైన సీఎం రమేష్‌ను నెత్తికెక్కించుకుని జిల్లాలో ఓట్లు ఉన్న ముఖ్య నేతలందరినీ పక్కన పెట్టడంతో పార్టీ భ్రష్టు పట్టిందని వారు ఆరోపించారు. ఇతర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సైతం చంద్రబాబు తీరును ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.  

మరిన్ని వార్తలు