చెప్పేటందుకే నీతులు.. 

13 Dec, 2019 10:35 IST|Sakshi

ఆంగ్ల మాధ్యమానికి టీడీపీ నేతలు వ్యతిరేకం

వారి పిల్లల చదువు మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలోనే... 

పేదలకు ఆ మీడియం దూరం చేయాలనే రాద్ధాంతం 

ఇదెక్కడి న్యాయమంటున్న సామాన్య జనం 

వారు మాత్రం తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివిస్తారట... ఎదుటివారికి మాత్రం  దానిని అందనివ్వరట... అందుకే సర్కారు బడుల్లో  ఆ మీడియం వద్దంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు. నిరుపేదలకు ఆ మీడియం దూరం  చేయాలన్నదే వారి లక్ష్యం. అందుకే తెలుగుపై తమకే వల్లమాలిన ప్రేమ ఉన్నట్టు... సర్కారు దానిని కనుమరుగు చేసేస్తున్నట్టు తెగ బాధపడిపోతున్నారు. ఇదీ తెలుగుదేశం నేతల తీరు. రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో దానిపై లేనిపోని అడ్డంకులు సృష్టిస్తున్న టీడీపీ తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. 

టీడీపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు తన ఇద్దరు కుమార్తెలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విద్యావతీదేవిలను ఇంగ్లిష్‌ మీడియంలోనే హైదరాబాద్‌లోని విద్యారణ్య ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదివించారు. అదితి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అశోక్‌ కూ డా ఇంగ్లిష్‌ మీడియంలోనే గ్యాలియర్‌లో చదివారు. తెలుగు పలకడానికి కూడా వీరు ఇబ్బంది పడుతుంటారు.

సాక్షి, ప్రతినిధి విజయనగరం: ప్రతి ఒక్కరికీ తమ పిల్లలపై బోలెడు ఆశలుంటాయి. వారు ఉన్నతంగా ఎదగాలనీ... తమకు ఆసరాగా నిలవాలనీ... జీవితంలో ఏ మాత్రం వారు కష్టపడకూడదని ఆకాంక్షిస్తారు. దీనికి నిరుపేదలేమీ మినహాయింపు లేదు. ముఖ్యంగా వారిలోనే ఎక్కువ ఉబలాటం ఉంటుంది. అందుకోసమే తమ పిల్లలను కాన్వెంట్లలో, కార్పొరేట్‌ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు చెల్లించి చదివించడానికి అప్పులు చేస్తూ కష్టపడుతున్నారు. ఇంకా నిరుపేదలైతే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. అలా చదివిన వారు ఆంగ్లం విషయంలో కార్పొరేట్‌ విద్యార్థులతో పోటీపడలేకపోతున్నారు. మల్టీ నేషన్‌ కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్లినపుడు, పోటీ పరీక్షలకు హాజరైనప్పుడు ఇంగ్లిష్‌తో ఇబ్బంది పడుతున్నారు.

వారి కష్టాన్ని చూసి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్య మం తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ దీని కి మతాన్ని ముడిపెట్టి ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వారికి మరో పార్టీ నాయకులు వంతపాడుతున్నారు. అసలు వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ఆరా తీస్తే జిల్లాలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేల కుమారులు, కుమార్తెలు ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుతున్నారనే విషయం బయటపడింది. విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లోని కార్పొరేట్‌ స్కూళ్లలో టీడీపీ నేతల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీల పిల్లలది ఇంగ్లిష్‌ మీడియమే 

టీడీపీ మాజీ రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు తన కుమారుడు విశాలకృష్ణ రంగారావు, కుమార్తె కృతీ గోపాల్‌ను విశాఖపట్నంలోని ఓక్రిడ్జ్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదివించారు. సుజయ్‌ కూడా తెలుగు మీడియంలో చదవలేదు.   

టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తన కుమార్తె ప్రణతిని, కుమారుడు పృథీ్వని సాలూరులోని లయన్స్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదివించారు.

టీడీపీ సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌ కుమారుడు బ్రీజేష్‌కుమార్‌ కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో  చదివారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు కుమార్తె దీక్షిత, కుమారుడు వంశీ విజయనగరంలోని సెంట్‌ జోసెఫ్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లోనే చదివారు.  

శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కవల కుమార్తెలు అని్వతానాయుడు, అమితానాయుడు కొత్తవలసలోని జిందాల్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చదివారు. ప్రస్తుతం విశాఖలో చైతన్య కళాశాలలో చదువుతున్నారు.

 మీసాల గీత కుమారుడు కిరీటి విజయనగరం భాష్యం స్కూల్‌లో, కుమార్తె సువర్ణ బొబ్బిలి అభ్యుదయ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో చదివారు.  

చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని తన కుమారుడు కిమిడి నాగార్జునను శ్రీకాకుళంలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో విద్యాభ్యాసం చేయించారు. 

వీరి పోరాటం ఎవరికోసం? 
తమ పిల్లలను ఎంచక్కా ఇంగ్లిష్‌ మీడియంలో చదివించుకుంటున్న టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం వద్దని, మాతృ భాషను మంట గలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు వీరి పోరాటం ఎవరికోసమన్న చర్చకూ దారితీస్తోంది. తమ పిల్లలు మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని ఎంబీబీఎస్, పీజీ, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులకు పంపిస్తూ...  సామాన్యుల పిల్లలు చదువుకునే పాఠశాలల్లో మాత్రం ఇంకా తెలుగు మీ డియంనే కొనసాగించాలని కోరుకోవడం ఏమి టన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తోంది.

   

మరిన్ని వార్తలు